ఆర్జీవీ డెన్‌లో అమితాబ్‌ సందడి.. ‘వ్యూహం’ కోసమేనా? | Sakshi
Sakshi News home page

ఆర్జీవీ డెన్‌లో అమితాబ్‌ సందడి.. ‘వ్యూహం’ కోసమేనా?

Published Wed, Feb 28 2024 4:13 PM

Amitabh Bachchan Visits Ram Gopal Varma Office RGV Den At Hyderabad - Sakshi

ప్రముఖ దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ, బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ మంచి స్నేహితులన్న విషయం అందరికి తెలిసిందే. ఆర్జీవీతో సినిమా అంటే కథ వినకుండా ఓకే చెప్పే నటుల్లో అమితాబ్‌ ఒక్కరు. ఆర్జీవీ ముంబైకి వెళ్లిన ప్రతిసారి అమితాబ్‌ను కలుస్తుంటారు. అపాయింట్మెంట్ లేకుండానే అమితాబ్‌ని ఇంటికి వెళ్లి కలిసే అతి కొద్దిమందిలో వర్మ ఒక్కరు. సర్కారు సినిమా ద్వారానే వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది.

(చదవండి: మార్చి 2న 'వ్యూహం' రిలీజ్.. ఆర్జీవీ ఇంట్రెస్టింగ్ ట్వీట్)

అమితాబ్ కెరీర్ కాస్త ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సర్కార్‌(2005) సినిమా తెరకెక్కించి బిగ్‌ హిట్‌ ఇచ్చాడు వర్మ. ఆ తర్వాత 2008లో ఈ మూవీకి సీక్వెల్‌గా ‘సర్కార్‌ రాజ్‌’ అనే సినిమా చేశారు. అదీ సూపర్‌ హిట్‌ అయింది. 2017లో సర్కార్‌ 3 తీసుకొచ్చారు. అయితే ఆ చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. అయినా కూడా వీరిద్దరి మధ్య స్నేహం మాత్రం అలానే కొనసాగింది. ఫ్రీ టైమ్‌ దొరినప్పుడల్లా వీరిద్దరు కలుస్తుంటారు. తాజాగా హైదరాబాద్‌కు వచ్చిన అమితాబ్‌.. ఆర్జీవీ డెన్‌లో సందడి చేశారు. డెన్‌ మొత్తం కలియతిరిగి.. ప్రత్యేకతలు ఏంటో అడిగి తెలుసుకున్నాడు.

తన కార్యాలయానికి వచ్చిన సర్కార్‌(అమితాబ్‌ని ఆర్జీవీ ముద్దుగా సర్కార్‌ అని పిలుస్తుంటాడు)కి ఆర్జీవీ సాదరంగా ఆహ్వానం పలికారు. దగ్గరుండి డెన్‌ మొత్తం చూపించాడు. అలాగే ఆఫీస్‌లోని తన సీట్లో కూర్చొబెట్టి.. సర్కార్‌పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలను ఎక్స్‌లో పోస్ట్‌ చేస్తూ.. సర్కార్‌ నా సీటులో కూర్చున్నాడు అని క్యాప్షన్‌ ఇచ్చాడు.

అలాగే వ్యూహం నిర్మాత దాసరి కిరణ్‌ సైతం ఆర్జీవీ డెన్‌లో ఆమితాబ్‌ని కలిశాడు. దానికి సంబంధించిన ఫోటోని ఎక్స్‌లో షేర్‌ చేస్తూ..‘నేను, దాసరి కిరణ్‌ కలిసి అమితాబ్‌తో ‘వ్యూహం’  రచించాము అని సరదాగా రాసుకొచ్చాడు. ఈ రెండు ఫోటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఇది చూసి వ్యూహం ప్రమోషన్‌ కోసమే అమితాబ్‌ హైదరాబాద్‌ వచ్చారంటూ నెటిజన్స్‌ కామెంట్‌ చేస్తున్నారు. అయితే అమితాబ్‌ మాత్రం కల్కీ 2898  సినిమా షూటింగ్‌ కోసం హైదరాబాద్‌ వచ్చినట్లు తెలుస్తుంది. విరామ సమయంలో ఆర్జీవీని కలిశాడు.ఆర్జీవీ తెరకెక్కించిన తాజా చిత్రం ‘వ్యూహం’ మార్చి 2న విడుదల కాబోతుంది.

Advertisement
 
Advertisement