ప్రజలను ప్రేమించడమే దేశభక్తి!

Adivi Sesh About Indian Country Soldiers - Sakshi

అడివి శేష్‌ పెరిగింది అమెరికాలో. కానీ ఆలోచనలన్నీ తన మాతృదేశం ఇండియా చుట్టే. అమెరికాలో ‘వందేమాతరం’ వినబడినా లేచి నిలబడేంత ప్రేమ తన దేశం మీద శేష్‌కి ఉంది. ఇప్పుడు ‘మేజర్‌’లో నటించాక దేశ సైనికులపై ప్రేమ, గౌరవం పెరిగాయి. 26/11 ముంబై దాడుల్లో వీరమరణం పొందిన ఎన్‌ఎస్‌జీ కమాండో సందీప్‌ ఉన్నికృష్ణన్‌ బయోపిక్‌గా ‘మేజర్‌’  తెరకెక్కుతోంది. సందీప్‌ పాత్రను అడివి శేష్‌ చేస్తున్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ టీవీకి ఇచ్చిన స్పెషల్‌ ఇంటర్వ్యూలో అడివి శేష్‌ చెప్పిన విశేషాల్లో ముఖ్యమైనవి ఈ విధంగా...

నా భవిష్యత్‌ కోసం అమ్మానాన్న అమెరికా షిఫ్ట్‌ అయ్యారు. నేను చిన్నప్పుడు అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్‌ స్కూల్‌లో చదువుతున్నప్పుడే ఇండియా గురించి ఆలోచిస్తూ ఉండేవాడిని. ఏఆర్‌ రెహమాన్‌గారి ‘వందేమాతరం’ పాట వచ్చినప్పుడు నిలబడేవాడిని. మా తాతగారు స్వాతంత్య్ర సమరయోధులు. అందువల్లే దేశభక్తి గీతాలు వచ్చినప్పుడు నిలబడుతుంటానేమో.

సైనికులు మన రక్షణ కోసం దేశ సరిహద్దుల్లో ఎంతో కష్టపడుతున్నారు. ‘మేజర్‌’ సినిమా కోసం కొంత పరిశోధన చేశాను. దేశ సైనికులపై నాకు ఉన్న గౌరవం, ప్రేమ, అభిమానం ఇప్పుడు మరింత పెరిగాయి. ‘మేజర్‌’ సినిమా కోసం నేను కొన్ని బోర్డ్‌ క్యాంపస్‌లలో పాల్గొన్నాను.. శిక్షణ తీసుకున్నాను. అతి వేడి, అతి చలిలో ఉండాలి. కొన్నిసార్లు ఆహారం కూడా లభించని పరిస్థితులు ఉంటాయి. అలా ఓ సైనికుడిలా ఉండగల పట్టుదల, శక్తి నాలో ఉన్నాయో? లేవో కూడా నాకు తెలియదు.

26/11 ముంబై దాడుల్లో చనిపోయిన అమరవీరుల్లో సందీప్‌ ఉన్నికృష్ణన్‌గారు ఉన్నారు. ఆర్మీ సైడ్‌ నుంచి మనం కోల్పోయిన వీరజవాన్‌ ఆయన. అందుకే ఆయన జీవితం గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలనుకున్నాను. ఆ తర్వాత సందీప్‌గారి జీవితం గురించి తెలుసుకుని ఆయనకు అభిమాని అయిపోయాను. ఫాలోయర్‌ అయ్యాను.

సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబుగారి ‘సరిలేరు నీకెవ్వరు’, సై్టలిష్‌స్టార్‌ అల్లు అర్జున్‌గారి ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ సినిమాలు ‘బయోపిక్‌’లు కాదు. ఆ కథలోని ఆర్మీ ఆఫీసర్‌ పాత్రకు జస్టిస్‌ చేసే ఒక స్టార్‌ని ప్రేక్షకులు చూడాలనుకుంటారు. కానీ ‘మేజర్‌’ విషయానికొస్తే.. మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ను వెండితెరపై చూడాలనుకుంటారు. ఎందుకంటే ఇది రియల్‌ స్టోరీ.అలాగే ‘మహానటి’ చూస్తున్నప్పుడు, ఆ సినిమాను ఎంత పెద్ద స్టార్‌ హీరోయిన్‌ చేసినప్పటికీ మనం వెండితెరపై సావిత్రిగారినే చూడాలనుకుంటాం. అలాగే ఎంత పెద్ద స్టార్‌ ప్లే చేసినా మనం మేజర్‌ సందీప్‌నే చూడాలనుకుంటాం. ‘మేజర్‌’లో సందీప్‌నే చూస్తారు.

ఆర్టికల్స్, బుక్స్‌లలో మేజర్‌ ఉన్నికృష్ణన్‌ జీవితం గురించి కొన్ని విషయాలు, విశేషాలను తెలుసుకున్నాను. కానీ ఆయన కుటుంబసభ్యుల వల్ల, వారు ఇచ్చిన గైడెన్స్‌ వల్ల ఆయన గురించి నాకు కొత్త సంగతులు తెలిశాయి. ‘మేజర్‌’ చిత్రానికి డెప్త్‌ ఇచ్చిందే వాళ్లు.

‘మేజర్‌’ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ...‘ఇండియన్‌ అంటే ఏంటి’? సాటి మనిషికి మనం సాయం చేయడం అంటే ఏంటి?, ‘సోషల్‌ మీడియాలో మనం యాష్‌ట్యాగ్‌తో జైహింద్‌ అని పెట్టేస్తే సరిపోతుందా? ఇలాంటి అంశాల గురించి ప్రేక్షకులు ఆలోచిస్తారు. అయితే ఒక సినిమా ఒక మనిషిని ఎంత మారుస్తుంది? అనేది నాకు తెలియదు.

నేనొక మంచి రైటర్, మంచి యాక్టర్‌.. కానీ బ్యాడ్‌ డైరెక్టర్‌ (సరదాగా). నా ఫస్ట్‌ ఫిల్మ్‌కు నేనే దర్శకత్వం వహించాను. కానీ డైరెక్షన్‌ అనేది నాకు సూట్‌ కాదని  అర్థమైంది. ‘గూఢచారి’ సినిమాకు నేను కథ రాసుకున్నట్లే స్క్రీన్‌పై దర్శకుడిగా శశికిరణ్‌ చూపించారు. కానీ విజువల్‌గా బాగా చూపించడం గ్రేట్‌. అయితే ఇప్పుడు ‘మేజర్‌’ బిగ్‌ బడ్జెట్‌ ఫిల్మ్‌. సో.. ఈ సినిమాను మరింత గ్రాండియర్‌గా తీయాలంటే శశికిరణే కరెక్ట్‌ అనిపించింది.  

ప్రస్తుతానికి సినిమాలనే పెళ్లి చేసు కున్నాను. సినిమాలు కాకుండా ఆలోచించాలంటే అప్పుడు పెళ్లి గురించి ఆలోచిస్తాను.

కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ సమయంలో నేను దేశభక్తిని ఎక్కువగా ఫీలయ్యాను. చాలామందికి సహాయం చేశాను. ప్రజలను ప్రేమించడం దేశభక్తే అవుతుందని నమ్ముతాను. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మంచి నీరు తాగే సౌకర్యం లేకపోవడం ఏంటి? నాకు తెలిసిన వాళ్లలో వారికి కరోనా టైమ్‌లో బెడ్స్‌ దొరక్కపోవడం ఏంటి? ఇంట్లో పేరెంట్స్‌కు ఆక్సిజన్‌ కాన్‌సన్‌ట్రేటర్‌ లేకపోవడం ఏంటి? కాస్త ఎమోషనల్‌గా ఫీలయ్యాను. కరోనా టైమ్‌లో ఎవరికో కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్‌ అంటే డబ్బులు పంపించాను. సాయం చేసిన మనిషిని కూడ నేను చూడలేదు. ఆయన నాకు థ్యాంక్స్‌ చెప్పలేదు. కానీ మనం ఒకరికొకరం సాయం చేసుకోవాలి. కెరీర్‌ సక్సెస్‌లో, నా సంపాదనలో ప్రజలు ఉన్నప్పుడు మనం కాకపోతే ఇంకెవరు సాయం చేస్తారు? 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top