ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్
కౌడిపల్లి(నర్సాపూర్): తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి, సరైన గౌరవం కల్పిస్తామని కేకే కమిటీ సభ్యుడు, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్నారు. మండలంలోని రాయిలాపూర్ ఉన్నత పాఠశాలకు స్థలం ఇచ్చిన దాత రావి కామాక్షమ్మ వర్ధంతి కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గత ప్రభుత్వంలో ఉద్యమకారులకు సరైన గౌరవం దక్కలేదన్నారు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం కేకే కమిటీని వేసిందన్నారు. తొలి, మలిదశ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులు, కవులు, కళాకారులను గుర్తించి ప్రభుత్వ సహాయ సహకారాలు అందించనున్నట్లు చెప్పారు. ఇందులో అమరులకు ప్రథమ స్థానం, ఉద్యమంలో పోరాడి గాయపడిన వారికి ద్వితీయ, జైలుకు వెళ్లిన వారికి తృతీయస్థానం ఇచ్చి వారికి సముచిత గౌరవం కల్పించేందుకు కేకే కమిటీ చర్యలు తీసుకుంటుందని వివరించారు. కార్యక్రమంలో దేవయ్య, బాలరాజుగౌడ్, యాదిగిరి, అశోక్, శ్రీరాములు, సధాకర్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
నిజాంపేట(మెదక్): బీఆర్‌ఎస్ నాయకుల పోరాటంతోనే బండి భగీరథ్‌ను పోలీస్‌లు అరెస్ట్ చేశారని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మ అన్నారు. సోమవారం నిజాంపేటలో ఆమె విలేకరులతో మాట్లాడారు. బండి సంజయ్ పదవిలో ఉంటే పోలీస్‌లు అతడికి లొంగి కేసును మరోవైపు తిప్పే అవకాశం ఉంటుందన్నారు. ఈ విషయమై ప్రధాని చొరవ తీసుకొని సంజయ్‌ను మంత్రి పదవి నుంచి తొలగించాలని కోరారు. కేసును సరైన రీతిలో విచారణ జరిపి బాధితురాలికి న్యాయం చేయాలని వేడుకున్నారు. గత ప్రభుత్వంలో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వమే ప్రతి గింజను కొనుగోలు చేసిందన్నారు. ధాన్యం సేకరణలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. సమావేశంలో నాయకులు బాపురెడ్డి, రంజిత్‌గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
రామాయంపేట(మెదక్): మున్సిపాలిటీలో పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలు చోటు చేసుకున్నాయని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రాగి రాములు, పార్టీ పట్టణాధ్యక్షుడు అవినాశ్‌రెడ్డి, ఓబీసీ విభాగం రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు చింతల శేఖర్ ఆరోపించారు. సోమ వారం పార్టీ కార్యాలయంలో వారు మాట్లాడుతూ.. మున్సిపాలిటీకి సంబంధించి 13 దుకాణాలుండగా, వాటిలో రెండు దుకాణాలకు సంబంధించి పేర్లను నిబంధనలకు విరుద్ధంగా మార్పిడి చేశారన్నారు. సదరు దుకాణాల లీజు గడువు ముగిసినా, ఇప్పటివరకు కొత్తగా రీటెండర్ వేయలేదన్నారు. ఏడా దిగా మున్సిపాలిటీలో రూ. కోటిన్నరకు పైగా నిధులు దుర్వినియోగం అయ్యాయని, ఈవిషయమై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో పార్టీ మాజీ అధ్యక్షుడు భానుచందర్, పట్టణ ఉపాధ్యక్షుడు యాదగిరిగౌడ్, నాయకులు వెంకటేశ్, సంతోష్, అనిల్ పాల్గొన్నారు.
మెదక్ కలెక్టరేట్: జిల్లాలోని ప్రాథమిక చేనేత సహకార సంఘాల తుది ఓటరు జాబితాను విడుదల చేసినట్లు జిల్లా చేనేత, వస్త్ర పరిశ్రమల శాఖ సహాయ అధికారి సాగర్ సోమ వారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పూర్తిస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి, తుది సభ్యత్వ జాబితాను అధికారికంగా ఆమోదించినట్లు చెప్పారు. జిల్లా చేనేత, వస్త్ర పరిశ్రమల శాఖ కార్యాలయం, ప్రాథమిక చేనేత సహకార సంఘాల కార్యాలయాల్లో తుది ఓటరు జాబితా అందుబాటులో ఉంచామన్నారు. ఎన్నికలు సజావుగా జరిగేలా చూసేందుకు, ఈ తుది ప్రతిపాదనలను వీలైనంత త్వరగా రాష్ట్ర సహకార ఎన్నికల అధికారులకు సమర్పిస్తామని తెలిపారు. తుది జాబితా ఆధారంగానే ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుందని వివరించారు.


