కంకర పరిచి.. వెన్ను విరిచి | - | Sakshi
Sakshi News home page

కంకర పరిచి.. వెన్ను విరిచి

May 18 2026 10:43 AM | Updated on May 18 2026 10:43 AM

అధ్వానంగా అంతర్‌ జిల్లా లింకు రోడ్డు

ఇబ్బంది పడుతున్న రెండు జిల్లాల ప్రజలు

పట్టించుకోని అధికారులు

రామాయంపేట/నిజాంపేట(మెదక్‌): అది ఎంతో ప్రాధాన్యత గల అంతర్‌ జిల్లా లింకు రోడ్డు. మెదక్‌– కామారెడ్డి జిల్లాలను కలుపుతున్న ఈ రోడ్డుపై నిత్యం వందలాది మంది ప్రయాణిస్తారు. పూర్తిగా శిథిలమైన ఈరోడ్డును మరమ్మతు చేయడానికి గాను మూడేళ్ల క్రితం కంకర పరిచి వదిలేశారు. అప్పటి నుంచి మరమ్మతుల విషయమై ఎవరూ పట్టించుకోవడం లేదు. దీంతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు.

మూడేళ్లుగా ముప్పు తిప్పలు

జిల్లా పరిధిలోని చల్మెడ కమాన్‌ నుంచి కామారెడ్డి జిల్లా బీబీపేట, దోమకొండ మండలాలకు వెళ్లడానికి ఇది దగ్గరి మార్గం కావడంతో రెండు జిల్లాలకు చెందిన ప్రజలు ఈ రోడ్డుపై ప్రయాణిస్తారు. బీబీపేట, ఇతర సమీప గ్రామాలకు చెందిన విద్యార్థులు వందలాది మంది చదువు నిమిత్తం రోజూ ఆర్టీసీ బస్సులో రామాయంపేట వస్తుంటారు. రోడ్డు పాక్షికంగా ధ్వంసం కావడంతో గతంలో కొన్ని రోజులు ఆర్టీసీ బస్సులు సైతం రద్దు చేశారు. కామారెడ్డి జిల్లా పరిధిలో రోడ్డు బాగానే ఉండగా, మెదక్‌ పరిధిలో మాత్రం 6 కిలోమీటర్ల మేర రోడ్డు పూర్తిగా శిథిలమైంది. మరమ్మతుల కోసం గతంలోనే నిధులు మంజూరు కావడంతో సంబంధిత కంట్రాక్టర్‌ కంకర తొక్కించి వదిలేశాడు. ఏమైందో తెలియదు కాని అప్పటి నుంచి రోడ్డు మరమ్మతులకు నోచుకోలేదు. ఈవిషయమై పలుమార్లు ప్రజాప్రతినిధులతో పాటు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని ఆయా గ్రామాల ప్రజలు వాపోయారు. ఈరోడ్డుపై ప్రయాణిస్తే తమ వాహనాలు దెబ్బతింటున్నాయని, తాము తరచూ ప్రమాదాల బారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ద్విచక్ర వాహనాలు సైతం తరచూ పంక్చర్‌ అవుతున్నాయని, ముఖ్యంగా రాత్రివేళ ఈ రోడ్డుపై ప్రయాణం నరకప్రాయంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన చల్మెడ తిరుమలనాథస్వామి ఆలయానికి వస్తున్న భక్తులు సైతం ఈ రోడ్డుతో ఇబ్బందులపాలవుతున్నారు.

ఇబ్బంది పడుతున్నాం

మూడేళ్ల క్రితం చల్మెడ రోడ్డుపై కంకర తొక్కించి వదిలేశారు. అప్పటి నుంచి అధికారులు పట్టించుకోకపోవడంతో తాము ఇబ్బందులపాలవుతున్నాం. ఇప్పటికై నా అధికారులు స్పందించి రోడ్డును బాగు చేయించాలి.

– కనకరాజు, నందగోకుల్‌

త్వరలో మరమ్మతులు

చల్మెడ కమాన్‌ వద్ద నుంచి జిల్లా శివారు వరకు గతంలో కంకర తొక్కించి వదిలేసిన రోడ్డు మరమ్మతుల కోసం కృషి చేస్తున్నాం. నిధులు సైతం సిద్ధంగా ఉన్నాయి. పూర్తిస్థాయిలో రహదారిని మరమ్మతులు చేయిస్తాం.

– విజయసారథి, ఏఈ, ఆర్‌అండ్‌బీ

Advertisement
 
Advertisement
Advertisement