జిల్లాలో పంటల విస్తీర్ణం 3.67 లక్షల ఎకరాలు
● గతేడాది కంటే 17 వేలు అధికం
● అత్యధికంగా వరి వైపు మొగ్గు
మెదక్ కలెక్టరేట్: ఖరీఫ్ సాగు ప్రణాళికను వ్యవసాయ సిద్ధం చేసింది. ఈ ఏడాది జిల్లాలో ఆయా రకాల పంటలు మొత్తం 3,67,668 ఎకరాల్లో సాగు కానున్నట్లు అంచనా వేశారు. అయితే గతేడాది వానాకాలంలో 3,15,675 ఎకరాలు సాగు కాగా, ఈఏడాది 10 వేల ఎకరాలు అత్యధికంగా సాగు కానున్నట్లు అధికారులు ప్రకటించారు. ఇందులో అత్యధికంగా వరి 31,6,690 ఎకరాలు కాగా, రెండో స్థానంలో పత్తి 36,000 వేల ఎకరాల్లో సాగు కానున్నట్లు ప్రకటించారు. గత మూడేళ్లలో వరితో పాటు అన్నిరకాల పంటల సాగు విస్తీర్ణం పెరుగుతున్నట్లు వ్యవసాయ అంచనా వేసింది. ఇందుకోసం అవసరమయ్యే విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అందుబాటులో ఉండేలా చర్యలు చేపడుతున్నారు.
వ్యవసాయమే ఆధారం
జిల్లాలో ఏటా రెండు పంటలు సాగు చేస్తారు. ఏకై న మధ్య తరహా ప్రాజెక్టు ఘనపూర్, హల్దీ కింద చెరువు లు, కుంటలు, బోరు బావులపై ఆధారపడుతున్నారు. వానాకాలంలో ప్రధానంగా వరి, పత్తి, మొక్కజొన్న, జొన్న, కందులు పండిస్తుంటారు. అయితే జిల్లాలో రైతులు అత్యధికంగా సన్న వడ్ల సాగుకు మొగ్గు చూపుతున్నారు. ప్రభుత్వం సైతం బోనస్ ఇస్తుండటంతో గత మూడేళ్లుగా రైతులు వరి సాగు చేస్తున్నారు. ప్రభుత్వ మద్దతుతో పాటు బోనస్ లభిస్తుండటంతో ఈ ఏడాది సన్నాల సాగు మరింత పెరిగే అవకాశం ఉంది. ఆ దిశగా వ్యవసాయ అధికారులు సైతం సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే యాసంగి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ సాగుతుండగా, మరోవైపు రైతులు వానాకాలం సాగుకు సన్నద్ధమవుతున్నారు.


