● బడ్జెట్, అభివృద్ధి పనుల బాధ్యత వారిదే
● ఎస్‌ఎంసీ, హెచ్‌ఎంలకు జాయింట్ చెక్ పవర్
● జిల్లాలో 923 ప్రభుత్వ పాఠశాలలు
పాపన్నపేట ఉన్నత పాఠశాల
పేరెంట్స్ చేతికి ప్రభుత్వ పాఠశాలలు
ప్రభుత్వ బడుల బలోపేతం దిశగా విప్లవాత్మక నిర్ణయాలు తీసుకునేందుకు కేంద్రం సమాయత్తం అవుతుంది. ఇకపై పాఠశాలల నిర్వహణ, బడ్జెట్ బాధ్యతలను నేరుగా విద్యార్థుల తల్లిదండ్రులకే అప్పగించనుంది. ఎస్‌ఎంసీలకు, హెచ్‌ఎంలకు జాయింట్ చెక్ పవర్ ఇవ్వనుంది. కమిటీలో 75 శాతం పేరెంట్స్, 25 శాతం ఇతరులు ఉండేలా చర్యలు తీసుకుంటుంది. ఇందులో 50 శాతం మహిళలే ఉంటారు. జాతీయ విద్యా విధానం 2020 ఆధారంగా వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ మార్పులు జరగనున్నట్లు సమాచారం.
– మెదక్ అర్బన్
ప్రభుత్వ బడులను బలోపేతం చేసేందుకు ప్రస్తుతం ఇస్తున్న సమగ్ర శిక్ష నిధులలో కేంద్రం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం భరిస్తున్నాయి. ఇక పీఎంశ్రీ స్కూళ్లకు కేంద్ర ప్రభుత్వమే నిధులు ఇస్తుంది. రెండేళ్లుగా ఎస్‌ఎంసీ కమిటీలు లేకపోవడంతో వాటి స్థానంలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలను ఏర్పాటు చేశారు. అప్పట్లో ఎస్‌ఎంసీ కమిటీ చైర్మన్, హెచ్‌ఎంకు పాఠశాల నిధులపై జాయింట్ చెక్ పవర్ ఉండేది. ప్రస్తుతం అమ్మ ఆదర్శ కమిటీలు నామినేట్ కావడంలో వారికి చెక్ పవర్ లేదు.
పేరెంట్స్ కమిటీలే పవర్‌ఫుల్
వచ్చే విద్యాసంవత్సరం నుంచి పాఠశాల నిర్వహణలో.. బడ్జెట్ ఖర్చులో పేరెంట్స్ కమిటీలే పవర్‌ఫుల్‌గా మారబోతున్నాయి. కమిటీ చైర్మన్‌కు, పాఠశాల హెచ్‌ఎంకు జాయింట్ చెక్ పవర్ ఇవ్వనున్నారు. తల్లిదండ్రుల అనుమతి లేకుండా, ఒక్క రూపాయి కూడా వాడేందుకు వీలు లేదు. పాఠశాలలో రూ.30 లక్షల లోపు నిర్మాణ పనులను పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ అనుమతి లేకుండానే ఎస్‌ఎంసీలు నేరుగా చేపట్టవచ్చు. ప్రైవేట్ కంపెనీల నుంచి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధులను సేకరించేందుకు అనుమతి కల్పించారు.
ప్రతి పైసాకు లెక్క చెప్పాల్సిందే
నిధుల వినియోగంలో పారదర్శకత పాటించేందుకు ప్రభుత్వ ఆడిట్‌తో పాటు వార్షిక సోషల్ ఆడిట్‌ను తప్పనిసరి చేశారు. బడులకు వచ్చే ప్రతి పైసా ఖర్చుల వివరాలను పట్లిక్ నోటీస్ బోర్డుపై బహిరంగంగా ప్రదర్శించాలి. జీరో టాలరెన్స్ విధానాన్ని పాటిస్తూ, ఏవైనా అవకతవకలు జరిగితే పోలీస్, ఆరోగ్య శాఖలతో కలిసి నేరుగా చర్యలు తీసుకునే అధికారం ఎస్‌ఎంసీలకు ఇచ్చారు.
కమిటీలో 75 శాతం తల్లిదండ్రులే
ఎస్‌ఎంసీ కమిటీలో 75 శాతం తల్లిదండ్రులే ఉంటారు. 25 శాతం టీచర్లు, పంచాయతీ సభ్యులు, కౌన్సిలర్, పూర్వ విద్యార్థులు, స్థానిక విద్యావేత్తలు మొదలగు వా రు ఉంటారు. మొత్తం కమిటీలో 50 శాతం మహిళలు ఉంటారు. కమిటీ పదవీకాలం రెండేళ్లు. ప్రతి నెలకోసారి కమిటీ విధిగా సమావేశం కావాలి. ఈ విషయమై ఏఈఓ సుదర్శణమూర్తిని వివరణ కోరగా.. ఇంకా కొత్త విధానంపై స్పష్టత రాలేదని తెలిపారు.


