ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్
మెదక్ కలెక్టరేట్: లైంగిక వేధింపులకు గురైన మహిళలు, బాలలకు భరోసా సెంటర్ ద్వారా అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నామని అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని భరోసా సెంటర్‌ను ఆయన తనిఖీ చేశారు. ఈసందర్భంగా కార్యాలయ రికార్డులు, సిబ్బంది విధుల నిర్వహణను పరిశీలించారు. పోక్సో కేసులు, బాధితుల రక్షణకు తీసుకుంటున్న చర్యలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. లైంగిక దాడులు, వేధింపులకు గురైన మహిళలు, బాలల పట్ల సిబ్బంది మానవతా దృక్పథంతో వ్యవహరించాలని సూచించారు. సకాలంలో న్యాయ, వైద్య సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం ఏఎస్పీ మాట్లాడుతూ.. బాధితులకు అవసరమైన అన్ని సేవలను సమన్వయంతో అందిస్తున్నామని చెప్పారు. లైంగిక వేధింపులకు గురైన వారు భయపడకుండా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని పిలుపునిచ్చారు. మహిళలు, బాలల రక్షణకు కఠినమైన చట్టాలు అమలులో ఉన్నాయని తెలిపారు. కార్యక్రమంలో భరోసా కోఆర్డినేటర్ సౌమ్య, లీగల్ అడ్వైజర్ శ్వేత, సిబ్బంది ఉన్నారు.


