వెల్దుర్తి(తూప్రాన్): మండలంలోని మానెపల్లి, శెట్టిపల్లి కలాన్ గ్రామాల్లో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సేంద్రియ వ్యవసాయం, వరి పంటకు ప్రత్యామ్నాయంగా ఉద్యాన పంటలైన ఆయిల్ పామ్, మామిడి లాంటి పంటల సాగు వల్ల కలిగే లాభాలను శాస్త్రవేత్తలు వివరించారు. ఈ సందర్భంగా తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ డా. ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుతం వ్యవసాయంలో రసాయన ఎరువులు, పురుగు మందులు అధికంగా వాడడం వల్ల నేల ఆరోగ్యం దెబ్బతిని పంట దిగుబడులు తగ్గిపోతున్నాయన్నారు. ఇలాంటి పరిస్థితులను అధిగమించడానికి సేంద్రియ ఎరువులైన పశువులు, కోళ్లు, జీవాల ఎరువు అధికంగా వేసుకోవాలన్నారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు డాక్టర్ విజయలక్ష్మి, శమహదేవప్ప, పుష్పవల్లి సర్పంచ్‌లు శేఖర్, సోమప్ప, ఏఈఓలు ఉత్తమ్ కుమార్, చంద్రవేణి పాల్గొన్నారు.
అధికారులు సిఫారసు చేసిన మందులనే వాడాలి
కొల్చారం(నర్సాపూర్): రైతులు పంటల సాగులో వ్యవసాయశాఖ అధికారులు సిఫారసు చేసిన మందులను మాత్రమే వాడాలని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు సైదానాయక్, రాకేశ్ పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని పోతిరెడ్డిపల్లి గ్రామపంచాయతీ పరిధి తుమ్మలపల్లి గ్రామంలో రైతు ముంగిట్లోకి శాస్త్రవేత్తలు కార్యక్రమంలో భాగంగా అక్కడి రైతులకు పంటలు సాగుపై అవగాహన కల్పించారు. ఎవరికివారు పురుగుల మందులు వాడడం, పంటలకు తీవ్రనష్టం తెచ్చిపెడుతుందన్నారు. అందుబాటులో ఉన్న వ్యవసాయ అధికారుల సూచనల మేరకే మందులు వాడాలన్నారు.
నాణ్యమైన విత్తనాల ఎంపికతో మేలు
కౌడిపల్లి(నర్సాపూర్): రైతులు అధిక దిగుబడి కోసం శాస్త్రవేత్తలు సూచించిన విత్తనాలను సాగు చేయాలని పీజేటీఏయూ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఏవీ రామాంజనేయులు తెలిపారు. శుక్రవారం మండలంలోని కంచన్‌పల్లిలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమంలో భాగంగా రైతులకు పంటలసాగుపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వరికి ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటలు, డ్రిప్, స్పింక్లర్ పద్ధతిలో పంటలు సాగుచేయాలన్నారు. దీంతో నీరు, ఖర్చు తగ్గుతుందని అధిక ఆదాయం వస్తుందన్నారు. అనంతరం ఏఓ స్వప్న మాట్లాడుతూ.. వరికోతలు అయ్యాక కొయ్యలు కాల్చవద్దని కలియదున్నాలని సూచించారు. కార్యక్రమంలో ఏఓ స్వప్న, శాస్త్రవేత్తలు ప్రేమ్, ఉమేష్, శ్రీకాంత్, సుమంత్‌కుమార్ పాల్గొన్నారు.


