కంచుకోటలో కారుమబ్బులు
● గ్రూపు తగాదాలతో బీఆర్‌ఎస్ చతికిల
● పంచాయతీ ఎన్నికల్లో
రెండో స్థానానికే పరిమితం
మెదక్‌జోన్: ఉద్యమ కాలం నుంచి ఉమ్మడి మెదక్ జిల్లా బీఆర్‌ఎస్‌కు కంచుకోటగా నిలిచింది. కేసీఆర్, హరీశ్‌రావు సొంత జిల్లా కావటంతో ప్రతీ ఎన్నికల్లో గులాబీ జెండా రెపరెపలాడింది. ప్రస్తుతం గ్రూపు తగాదాలతో చతికిలపడింది. రెండు విడతల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో వెనుకబడింది. 2019లో జరిగిన స్థానిక ఎన్నికల్లో 85 శాతానికి పైగా బీఆర్‌ఎస్ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందారు. జెడ్పీపీఠం సైతం గులాబీ ఖాతాలోనే చేరింది. అయితే అధికారం కోల్పోయిన తర్వాత పార్టీలో గ్రూపు తగాదాలు మొదలయ్యాయి. బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాశ్‌రెడ్డి, ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి కంఠారెడ్డి తిరుపతిరెడ్డి ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా మారారు. గ్రూపులు ఏర్పాటు చేసుకోవటంతో పార్టీ బలహీనపడింది. అభ్యర్థుల తరఫున ప్రచారం సైతం అంతంత మాత్రంగానే నిర్వహించారు. ఇది అధికార పార్టీకి కలిసొచ్చింది. బీఆర్‌ఎస్ రెండు విడతల్లో 88 స్థానాలకే పరిమితమై రెండో స్థానంలో నిలిచింది.
సత్తా చాటిన హస్తం
రెండు విడతల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కా ంగ్రెస్ సత్తా చాటింది. 309 సర్పంచ్ అభ్యర్థులకు గానూ ఏకగ్రీవాలతో కలుపుకొని 174 స్థానాలను ఖాతాలో వేసుకుని పైచేయి సాధించింది. రెబల్స్‌తో పార్టీకి నష్టం జరిగిందని, లేకుంటే మరిన్ని ఎక్కువ స్థానాలు గెలిచేవారమని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. మూడవ విడతపై ప్రత్యేక దృష్టి సారించి మరిన్ని సీట్లు సాధించే విధంగా చర్యలు తీసుకుంటామంటున్నారు. పార్టీ అధికారంలో ఉండటం, ముఖ్య నేతలు పంచాయతీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని పనిచేయడం హస్తం పార్టీకి కలిసొచ్చింది.
వికసించని కమలం
ఢిల్లీలో సత్తా చాటుతున్న బీజేపీ గ్రామీణ ప్రాంతాల్లో తన ప్రభావం చూపటం లేదు. ముఖ్యంగా జిల్లా ఓటర్లు అన్నిపార్టీలను అక్కున చేర్చుకున్నప్పటికీ పంచాయతీ ఎన్నికల్లో మాత్రం ప్రభావం చూపలేకపోయింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలో రెండు నియోజకవర్గాలకు గా నూ మెదక్ కాంగ్రెస్ వశం కాగా, నర్సాపూర్ బీఆర్‌ఎస్ గెలుచుకున్న విషయం విదితమే. అనంతరం జరిగిన ఎంపీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు భారీ మెజార్టీతో గెలిచారు. ఇప్పటివరకు రెండు విడతలుగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులు 35 చోట్ల గెలుపొందగా, బీజేపీ మాత్రం కేవలం 11 సీట్లకే పరిమితం అయింది.
సొంతూర్లో ‘పట్టు’ కోల్పోయారు
రామాయంపేట(మెదక్): సర్పంచ్ ఎన్నికల ఫలితాలు నేతలకు మిశ్రమ ఫలితాలు అందించాయి. వారు తమ స్వగ్రామాల్లో పట్టు కోల్పోకు ండా విశ్వ ప్రయత్నాలు చేశారు. మెదక్ ఎమ్మెల్యే తన స్వగ్రామంలో పట్టు నిలుపుకోగా, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాశ్‌రెడ్డి స్వగ్రామాల్లో బీఆర్‌ఎస్ బలపరిచిన అభ్యర్థులు ఓటమి పాలయ్యారు. మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ తన స్వగ్రామం చిన్నశంకరంపేట మండలం కొర్విపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి పుల్లారావును భారీ మెజార్టీతో గెల్పించుకొని పట్టు నిలుపుకున్నారు. బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి తన స్వ గ్రామం కోనాపూర్‌లో పట్టు నిలుపుకోలేకపోయారు. ఇక్కడ కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్ధి వెంకట్‌రాంరెడ్డి 120 పైచిలుకు ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. బీఆర్‌ఎస్ అభ్యర్ధి దివాకర్ మూడో స్థానంతో సరిపెట్టుకున్నారు. మాజీ ఎమ్మెల్సీ, బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు శేరి సుభాశ్‌రెడ్డి స్వగ్రామమైన హవేళిఘణాపూర్ మండలం కూచన్‌పల్లిలో కాంగ్రెస్ మద్దతుదారు లింగాల భూదేవి భారీ మెజారిటీతో గెలుపొందారు. ఇక్కడ బీఆర్‌ఎస్ అభ్యర్ధి రెండో స్థానంలో నిలిచారు. బీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి కంఠారెడ్డి తిరుపతిరెడ్డి స్వగ్రామంలో మాత్రం సొంత పార్టీ అభ్యర్థిని గెలిపించుకున్నారు. కాంగ్రెస్ ఓ పత్రిక విలేకరిని పోటీలో నిలిపింది. దీంతో కంఠారెడ్డి పట్టుదలతో రెండు, మూడు రోజుల పాటు అక్కడే మకాం వేసి బీఆర్‌ఎస్ బలపరిచిన అభ్యర్థి అందె కొండల్‌రెడ్డిని 233 ఓట్ల మెజార్టీతో గెలిపించుకున్నారు.
బీఆర్‌ఎస్ నేతలకు చుక్కెదురు!
సత్తా చాటిన ఎమ్మెల్యే రోహిత్‌రావు
కంచుకోటలో కారుమబ్బులు


