ఎత్తుకు పైఎత్తు..!
వెల్దుర్తి(తూప్రాన్): పంచాయతీ ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి. అభ్యర్థులు ప్రచారాలతో హోరెత్తించారు. సర్పంచ్‌కు పోటీ చేస్తున్న అభ్యర్థులు తమ ప్యానెల్ నుంచి వార్డు సభ్యులను కూడా రంగంలోకి దించడంతో గ్రామాల్లో పోటీ వాతావరణం నెలకొంది. మూడో దశ ఎన్నికలకు కేవలం మరో రెండు రోజులు మాత్రమే గడువు ఉండడంతో గెలుపు కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రత్యర్థుల ఊహకు అందని రీతిలో ఎత్తుగడలు వేస్తున్నారు. ప్రచారానికి గడువు ముగియడంతో కొత్త తరహా ప్రచారానికి సిద్ధమవుతున్నారు. కొన్ని గ్రామాల్లో ఓటర్లకు నగదును కూడా పంపిణీ చేసే ప్రయత్నాలు కూడా మొదలైనట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనికి తోడుగా ఆయా సర్పంచ్ అభ్యర్థులు రహస్య ప్రాంతాల్లో మద్యం దాచి ఉంచినట్లు సమాచారం. ఈ మద్యాన్ని చివరి రోజున ఓటర్లకు పంపిణీ చేసే దిశగా వారి వారి అనుచరులు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
పంచాయతీ ఎన్నికల్లో ప్రతి ఓటరు రెండు ఓట్లను వినియోగించుకోవాల్సి ఉంటుంది. ఒక ఓటు సర్పంచ్‌కు, మరో ఓటు వార్డు సభ్యుడికి వేయాలి. అయితే ఇక్కడ క్రాస్ ఓటింగ్ కాకుండా చూసుకునే ప్రయత్నాలు మొదలయ్యాయి. తమ సానుభూతిపరులు, అనుచరులతో పాటు తమ మద్దతుదారులంతా రెండు ఓట్లు ఒకే ప్యానల్ అభ్యర్థులకు వేసే విధంగా చర్యలు చేపట్టారు. దీనికోసం డమ్మీ బ్యాలెట్ పత్రాలతో ఓటర్లకు అవగాహన కల్పిస్తున్నారు. ఒకవేళ ఓటరు వేరు వేరు ప్యానళ్లకు సంబంధించి చెరో ఓటు వేసినట్లయితే ఫలితాలు తారుమారయ్యే ప్రమాదం లేకపోలేదు. ఒక ప్యానెల్‌కు చెందిన వార్డుసభ్యులు ఎక్కువగా గెలిచి అదే ప్యానెల్‌ను బలపరిచిన అభ్యర్థికి తక్కువ ఓట్లు వస్తే ఓటమి తప్పదని సర్పంచ్ అభ్యర్థులు ఆంధోళన చెందుతున్నారు. ఆయా వార్డుల వారీగా స్థానికంగా ప్రభావం చూపే వార్డు సభ్యులు తమతో పాటు మద్దతుదారుడైన సర్పంచ్ అభ్యర్థికి కూడా ఓటు వేసే విధంగా చర్యలు చేపడుతున్నారు.
ఎత్తుకు పైఎత్తు..!


