కమనీయం.. మల్లన్న కల్యాణం
భారీగా హాజరైన భక్తజనం
పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి సురేఖ
కొమురవెల్లి(సిద్దిపేట): మేళతాళాలు.. మంగళవాయిద్యాలు.. భక్తుల జయజయధ్వానాల మధ్య కొమురవెల్లి కోరమీసాల మల్లన్న కల్యాణం అత్యంత వైభవంగా జరిగింది. ఆదివారం క్షేత్రంలోని తోట బావి వద్ద సర్వాంగసుందరంగా ముస్తాబు చేసిన ప్రత్యేక మండపంలో మల్లన్న స్వామి.. మేడలాదేవి, కేతమ్మలను సరిగ్గా మధ్యాహ్నం 12.01గంటలకు వివాహమాడారు. ఆలయ అధికారుల పర్యవేక్షణలో వీరశైవ ఆగమ పండితులు కల్యాణ క్రతువును కనుల పండువగా నిర్వహించారు. కల్యాణ వేడుకను వీక్షించేందుకు రాష్ట్రం నుంచే కాక వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. ఆలయ గర్భగుడిలో ఉదయం 9 గంటలకు మూల విరాట్‌కు కల్యాణం నిర్వహించారు. అనంతరం స్వామి. అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను ప్రత్యేక పల్లకీలో ఊరేగింపుగా మేళాతాళలతో తోటబావి వద్ద గల మల్లన్న కళ్యాణవేదికకు చేర్చి కల్యాణ క్రతువు చేపట్టారు.
ప్రభుత్వం తరపున మల్లికార్జున స్వామికి ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలను దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సమర్పించారు. మాజీ ఎమ్మెల్సీ రాజలింగం, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి, మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి తదితరులు స్వామివారిని, అమ్మవార్లను దర్శించుకుని పూజలు నిర్వహించారు.
పీఠాధిపతుల పర్యవేక్షణలో ..
మల్లికార్జున స్వామి కల్యాణాన్ని పీఠాధిపతి మహమండలేశ్వర్ మహంత్ సిద్ధేశ్వరానందగిరి మహరాజ్ పర్యవేక్షణలో కొనసాగగా.. కల్యాణ వ్యాఖ్యతలుగా డాక్టర్ మహంతయ్య, సాంబశివశర్మ, శశిభూషణ సిద్దాంతిలు వ్యవహరించారు. దాదాపు మూడు గంటల పాటు జరిగిన స్వామి వారి కల్యాణ వేడుకను భక్తులు భక్తి శ్రద్ధలతో తిలకించారు.
మల్లన్న కల్యాణాన్ని తిలకిస్తున్న భక్తులు


