తగ్గేదేలే..! | - | Sakshi
Sakshi News home page

తగ్గేదేలే..!

Dec 5 2025 1:15 PM | Updated on Dec 5 2025 1:15 PM

తగ్గేదేలే..!

తగ్గేదేలే..!

ఖర్చు ఎంతైనా.. సర్పంచ్‌గా గెలవాల్సిందే..

ఈసారి తను.. వచ్చేసారి నువ్వు

ఖర్చు ఎంతైనా.. సర్పంచ్‌గా గెలవాల్సిందే..

బాండ్‌ పేపర్లపై హామీలు

ఆలయాల నిర్మాణాలకు చందాలు

పల్లెపోరును ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న అభ్యర్థులు

పల్లెల్లో పంచాయతీ పోరు హీటెక్కుతోంది. గెలుపు కోసం అభ్యర్థులు హామీల వర్షం కురిపిస్తున్నారు. డబ్బులు ఎంతైనా ఖర్చు పెట్టడానికి వెనుకాడటం లేదు. రాజకీయ జీవితంలో సర్పంచ్‌ పదవి మొదటి అడుగు కావడంతో ఈ అవకాశాన్ని వదులుకోవద్దని భావిస్తున్నారు. ఈ పోటీలో గెలుపు తప్ప ఓటమి ఉండకూడదని హామీలతో ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు ఏకంగా బాండ్‌ పేపర్లపై హామీలు రాసి ఇస్తుండగా, మరికొందరు ఆలయాల నిర్మాణాలు, గ్రామాభివృద్ధి కోసం నిధులు ఇస్తూ ఏకగ్రీవం చేయాలని కోరుతున్నారు. – మెదక్‌జోన్‌

జిల్లావ్యాప్తంగా 21 మండలాలు ఉండగా, 492 గ్రామ పంచాయతీల్లో మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. కాగా మొదటి విడత అభ్యర్థులకు ఇప్పటికే గుర్తులు కేటాయించడంతో ప్రచార పర్వాన్ని ముమ్మరం చేశారు. ఇటీవల హవేళిఘణాపూర్‌ మండలం రాజ్‌పేట తండాకు చెందిన ఓ వ్యక్తి తనను సర్పంచ్‌గా గెలిపిస్తే గ్రామంలో ఆడపిల్ల పుడితే రూ. 2 వేలు, కుల సంఘాల ఆధ్వర్యంలో జరిగే పండుగలకు రూ. 20 వేలతో పాటు మరో 15 హామీలకు సంబంధించి ఏకంగా బాండ్‌ పేపర్‌ను రాసిచ్చారు. ఆ గ్రామ వాట్సాప్‌ గ్రూపులో పోస్టు చేయటంతో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అదేవిధంగా చిన్నశంకరంపేట మండలంలోని మరో రెండు గ్రామాల్లో సర్పంచ్‌ అభ్యర్థులు బాండ్‌ పేపర్లు సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది.

ఒకరిని మించి మరొకరు..

ఎంత ఖర్చు అయినా పర్వాలేదు ఎన్నికల్లో సర్పంచ్‌గా గెలిచి తీరాలనే పట్టుదలతో అభ్యర్థులు ముందుకు సాగుతున్నారు. చిన్న పంచాయతీల్లో రూ. 5 నుంచి రూ. 10 లక్షల ఖర్చుకు సిద్ధం అవుతుండగా, మేజర్‌ పంచాయతీల్లో రూ. 10 నుంచి రూ. 20 లక్షల ఖర్చుకు సైతం వెనుకాడటం లేదు. ము ఖ్యంగా గ్రామాల్లో నిర్మించే ఆలయాల నిర్మాణాల కోసం పోటీ పడి చందాలు ఇస్తున్నారు. యూత్‌ కోసం శివాజీ విగ్రహాల ఏర్పాటు, క్రీడా సామగ్రి హామీలు ఇస్తూ ప్రసన్నం చేసుకుంటున్నారు. ఇప్పటికే మొదటి విడతలో ఏకగ్రీవమైన 16 పంచాయతీల్లో సైతం కొన్ని గ్రామాల్లో ఆలయాల నిర్మాణాలకు నిధులు సమకూర్చటంతో పాటు గ్రామాభివృద్ధి, కుల సంఘాల వారీగా డబ్బులు ఎరచూపినట్లు తెలిసింది.

జిల్లాలోని 71 గిరిజన తండాల్లో 100 శాతం గిరిజనులే ఉండటంతో వాటిని వారికే రిజర్వ్‌డ్‌ చేశారు. వాటిలో కొన్ని జీపీల్లో ఏకగ్రీవం కోసం ముమ్మరంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈసారి తనని సర్పంచ్‌గా ఎన్నుకుంటే, వచ్చేసారి నిన్ను ఎన్నుకుంటామంటూ గిరిజనులు ఏకగ్రీవం అవుతున్నా రు. అంతే కాకుండా సర్పంచ్‌ అయిన వ్యక్తి తండాల్లో సేవాలాల్‌ ఆలయ నిర్మాణంతో పాటు ఇతర సాంప్రదాయ పండుగలకు ఖర్చు పెట్టాలనే ఒప్పందాలు చేసుకుంటున్నారు. మరికొన్ని గ్రామాల్లో అభ్యర్థులు ప్రజలకు దండం పెట్టి ఓట్లడుగుతున్నారు. మీ అందరి సూచన మేరకు గ్రామాభివృద్ధి చేస్తానంటూ ప్రసన్నం చేసుకుంటున్నారు. ఇటీవల అల్లాదుర్గం మండలానికి చెందిన ఓ సర్పంచ్‌ అభ్యర్థి అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కాళ్లు మొక్కుతూ వేడుకున్న ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement