జాతీయస్థాయికి ఎదగాలి
ఎస్పీ డీవీ శ్రీనివాసరావు
మెదక్ మున్సిపాలిటీ: క్రీడా పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చి విజేతలుగా నిలిచిన పోలీస్ సిబ్బందిని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు అభినందించారు. రైసింగ్ డే వేడుకల్లో భాగంగా రెండు రోజులుగా నిర్వహించిన క్రీడా పోటీల తుది మ్యాచ్‌లు గురువారం జిల్లా పోలీస్ కార్యాలయం ప్రాంగణంలో నిర్వ హించారు. రామాయంపేట్, మెదక్ సర్కిల్ జట్ల మధ్య జరిగిన వాలీబాల్ ఫైనల్ మ్యాచ్ ఉత్కంఠను రేపింది. ఈ పోటీలో మెదక్ సర్కిల్ అద్భుత ప్రతిభ కనబరిచి మొదటి స్థానం, రామాయంపేట సర్కిల్ ద్వితీయ స్థానం సాధించాయి. కబడ్డీలో అల్లాదుర్గం సర్కిల్ మొదటి స్థానం, రామాయంపేట సర్కిల్ రెండవ స్థానం కై వసం చేసుకున్నాయి. మ్యూజికల్ చైర్ పోటీలో భూలి మొదటి స్థానం, లావణ్య ద్వితీయ స్థానం సాధించి మంచి ప్రతిభను ప్రదర్శించారు. ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఆసక్తి, క్రమశిక్షణతో భవిష్యత్తులో జాతీయస్థాయి పోటీల్లో కూడా పాల్గొనే స్థాయికి ఎదగాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ మహేందర్, ఏఆర్ డీఎస్పీ రంగానాయక్, ఆర్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.


