16 సర్పంచ్.. 332 వార్డులు
● ఏకగ్రీవం అయిన స్థానాలు
● మొదటి విడత అభ్యర్థులతుది జాబితా విడుదల
మెదక్ కలెక్టరేట్: జిల్లాలో మొదటి విడత ఎన్నికలు జరగనున్న 160 గ్రామ పంచాయతీలకు 16 సర్పంచ్ స్థానాలు, 1,402 వార్డులకు 332 ఏకగ్రీవం అయినట్లు కలెక్టర్ రాహుల్‌రాజ్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలోని మొదటి విడత ఎన్నికలకు ఆరు మండలాలను ఎంపిక చేయగా, అందులో అత్యధికంగా పాపన్నపేట 6, పెద్దశంకరంపేట 5, టేక్మాల్ 4, హవేళిఘణాపూర్ 1 చొప్పున సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమైనట్లు తెలిపారు. 14 గ్రామాల్లో సర్పంచ్, వార్డులు పూర్తిగా ఏకగ్రీవం అయినట్లు వివరించారు. ఆయా గ్రామాల్లో ఉప సర్పంచ్‌కు గురువారం ఎన్నికలు నిర్వహించి ఏకగ్రీవమైన అభ్యర్థులతో పాటు గెలుపొందిన ఉప సర్పంచ్‌లకు ధ్రువీకరణ పత్రాలు అందజేసినట్లు తెలిపారు. మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఏకగ్రీవమైనవి కాకుండా, మిగిలిన 144 సర్పంచ్, 1,072 వార్డు స్థానాలకు ఈనెల 11న ఎన్నికలు నిర్వహించనున్నారు.
నిబంధనలు పాటించాల్సిందే
కౌడిపల్లి(నర్సాపూర్): ఎన్నికల్లో పోటీ చేసే సర్పంచ్, వార్డు సభ్యులు ఎన్నికల నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని జిల్లా ఎన్నికల అధికారి రాహుల్‌రాజ్ సూచించారు. గురువారం కౌడిపల్లి మండల కేంద్రంలో నామినేషన్ల ప్రక్రియను పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిబంధనలు పాటిస్తూ ఎన్నికల ప్రచారం చేసుకోవాలన్నారు. ఓటర్లను ప్రలోభ పెట్టడానికి డబ్బు, మద్యం లేక ఇతర మార్గాలను ఎన్నుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్థులను విత్‌డ్రా చేయాలని, పోటీలో ఉండవద్దని ఒత్తిడి చేసిన, భయబ్రాంతులకు గురిచేసిన క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.


