కళాశాలలో మౌలిక వసతులు ఏవీ?
రాస్తారోకో నిర్వహిస్తున్న విద్యార్థులు
రామాయంపేట(మెదక్): ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు పట్టణంలో రాస్తారోకో నిర్వహించారు. ఈసందర్భంగా సంఘం రాష్ట్ర నాయకుడు బండారి ప్రశాంత్ మాట్లాడుతూ.. కళాశాల ప్రారంభమై మూడేళ్లు గడుస్తున్నా, ఇప్పటివరకు సొంత భవనం లేదన్నారు. తాత్కాలికంగా ఆర్డీఓ కార్యాలయంలో కొనసాగుతుందని వాపోయారు. ఆ భవనంలో ఎలాంటి వసతులు లేకపోవడంతో విద్యార్థులు సరిగా చదువుకోలేకపోతున్నారని తెలిపారు. ఈవిషయమై పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదన్నారు. టాయిలెట్ల సదుపాయం సక్రమంగా లేకపోవడంతో విద్యార్థినులు ఇబ్బందులపాలవుతున్నారని చెప్పారు. తాగునీటి సదుపాయం కల్పించకపోవడంతో విద్యార్థులు బస్టాండ్ వద్ద హోటళ్లను ఆశ్రయిస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పటికై నా కళాశాలలో సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాన్ని తీవ్ర తరం చేస్తామని హెచ్చరించారు. ఎస్‌ఐ బాలరాజు వారికి నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు.


