రైతులకు కుచ్చుటోపీ!
ముప్పుతిప్పలు పెడుతున్న సీడ్ కంపెనీలు
గత రబీ సీజన్‌లో పోటీపడి రైతులతో వేలాది ఎకరాల్లో విత్తన వరి సాగు చేయించారు. పంట నూర్పిళ్లు చేసి సదరు కంపెనీలకు విత్తనాలను అప్పగించి ఏడాది అవుతున్నా, నేటికీ డబ్బులు చెల్లించడం లేదు. ఆర్గనైజర్ల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతో చేసేది లేక ఇటీవల అన్నదాతలు పోలీసులను ఆశ్రయించారు.
– మెదక్‌జోన్
మధ్యవర్తుల తప్పుడు లెక్కలు
జిల్లాలో కొంతకాలంగా అనేక విత్తన కంపెనీలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. సదరు కంపెనీ యాజమాన్యాలు ఆర్గనైజర్లను మధ్యవర్తులుగా ఏర్పాటు చేసుకున్నాయి. వారికి కమీషన్ ఇస్తామని ఒప్పందం చేసుకొని రైతుల వద్దకు పంపుతున్నాయి. ఎకరాకు రూ. 75 వేలు ఇస్తామని ఒక కంపెనీ ఆర్గనైజర్ అంటే, మరో కంపెనీ ప్రతినిధి రూ. 80 వేలని, ఇంకొకరు రూ. లక్ష ఇస్తామంటూ రైతులను నమ్మించారు. పకృతి వైపరీత్యాలకు పంట దెబ్బతిన్నా, ఒప్పందం మేరకు నష్టపరిహారం ఇస్తామని నమ్మబలికారు. గత రబీ సీజన్‌లో జిల్లాలో 2.71 లక్షల ఎకరాల్లో వరి పంటలు సాగు చేయగా, అందులో 6,678 ఎకరాల్లో సుమారు 30 విత్తన కంపెనీలకు చెందిన ఆర్గనైజర్లు రైతులతో విత్తన వరి సాగు చేయించారు. అందులో సుమారు 5 వేల ఎకరాలకు సంబంధించిన డబ్బులు రైతులకు ఇవ్వగా, ఇంకా 1,600 పైచిలుకు ఎకరాలకు సంబంధించి సుమారు రూ. 10 కోట్ల పైచిలుకు డబ్బులు రైతులకు పలు కంపెనీలు బకాయిపడ్డాయి. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ పంట సైతం చేతికందుతోంది. ఏడాది అవుతున్నా డబ్బులు ఇవ్వకపోవడంతో అన్నదాతలు ఇటీవల పోలీసులను ఆశ్రయించి గోడు వెల్లబోసుకున్నారు. అయితే అటు విత్తన కంపెనీలను.. ఇటు రైతులను మోసం చేసింది మధ్యవర్తులేనని తెలిసింది. క్షేత్రస్థాయిలో ఓ కంపెనీకి చెందిన మధ్యవర్తి 150 ఎకరాల విత్తన (సీడ్)ను సాగు చేయించి సదరు కంపెనీ రికార్డుల్లో మాత్రం 200 ఎకరాలు సాగు చేయించినట్లు తప్పుడు లెక్కలు చూపించినట్లు సమాచారం. ఈ విషయాన్ని పసిగట్టిన సదరు కంపెనీల యజమాన్యాలు క్షేత్రస్థాయిలో సర్వే చేయించాయి. అయితే ఆర్గనైజర్లకు, కంపెనీల యాజమాన్యాలకు మధ్య జరుగుతున్న గొడవ కారణంగా ఇంకా 1,600 పైచిలుకు ఎకరాలకు సంబంధించిన డబ్బులు రైతులకుచెల్లించడం లేదు.
గత రబీకి సంబంధించినడబ్బులు నేటికీ ఇవ్వని వైనం
జిల్లాలో 6 వేల ఎకరాల్లోవిత్తన వరి సాగు


