ఎప్పుడు దారి కొచ్చేనో?
రామాయంపేట(మెదక్): ఆగస్టు చివరి వారంలో కురిసిన భారీ వర్షాలకు పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బీ రహదారులు, చెరువు కట్టలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇవి శిథిలమై రెండు నెలలు గడుస్తున్నా, ఇప్పటివరకు మరమ్మతులకు నోచుకోలేదు. ఫలితంగా ఆయా గ్రామాల ప్రజలు, రైతులు ఇబ్బందులపాలవుతున్నారు.
● లక్ష్మాపూర్ నుంచి దంతేపల్లి వరకు ఉన్న అంతర్ జిల్లా రహదారి పూర్తిగా దెబ్బతింది. దీంతో ఈ రహదారిపై ప్రయాణం ప్రమాదకరంగా మారింది. అలాగే లక్ష్మాపూర్ రైల్వేస్టేషన్‌కు వెళ్లే తారురోడ్డు మధ్యలో తెగిపోయింది. రెండు నెలలు గడిచినా, ఇప్పటివరకు మరమ్మతులకు నోచుకోలేదు. దీంతో రైల్వేస్టేషన్‌కు వెళ్లే ప్రయాణికులు అతి కష్టం మీద పంట చేల గుండా దాటుతున్నారు.
● నిజాంపేట మండల కేంద్రం నుంచి చల్మెడకు వెళ్లే రహదారిలో ఉన్న కల్వర్టు వర్షాలకు దెబ్బతింది. దీంతో కొన్ని రోజుల పాటు ఈదారిలో ప్రయాణాలు నిలిచిపోయాయి. కల్వర్టు ఒకవైపు దెబ్బతినగా, అడ్డంగా బోర్డు పెట్టారు. దీంతో ఆటోలు, బైక్‌లు మాత్రమే వెలుతున్నాయి.
● నిజాంపేట, నస్కల్ మధ్య రోడ్డు మరమ్మతులు పూర్తికాగా, కల్వర్టు నిర్మాణం చేపట్టకపోవడంతో వర్షాలకు ధ్వంసమైంది. పెద్ద వాహనాలు వెళ్లకుండా కల్వర్టుపై రోడ్డును కొంతమేర బ్లాక్ చేశారు. దంతేపల్లి, కాట్రియాల వద్ద చెరువు కట్టలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. యుద్ధ ప్రాతిపదికన వీటికి మరమ్మతులు చేయించాల్సి ఉండగా, ఇరిగేషన్ అధికారులు ఆదిశగా చర్యలు చేపట్టడం లేదు. మళ్లీ భారీ వర్షాలు కురిస్తే కట్టలు తెగే ప్రమాదం ఉండటంతో ఆయా గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
● వర్షాలకు జిల్లా పరిధిలో పంచాయతీరాజ్‌కు చెందిన 70 కిలోమీటర్ల మేర రోడ్డు దెబ్బతినగా, రోడ్డు భవనాల శాఖ పరిధిలో 40 కిలోమీటర్ల మేర రోడ్డు పాక్షికంగా ధ్వంసమైంది. కొన్ని రహదారులకు మాత్రమే తాత్కాలికంగా మరమ్మతులు చేయించిన అధికారులు నిధులు మంజూరు కాకపోవడంతో పర్మనెంట్ పనులకు ముందుకు రావడం లేదు.
● వరద నీరు పోటెత్తడంతో జాతీయ రహదారి 765 డీజీపై నందిగామ వద్ద ఏకంగా బ్రిడ్జి కుంగిపోయి పగుళ్లు వ్యాపించాయి. దీంతో 20 రోజుల పాటు ఈదారిలో ప్రయాణాలు నిలిచిపోయి మెదక్, సిద్దిపేట జిల్లాలకు చెందిన ప్రజలు తీవ్ర ఇబ్బంది పడ్డారు. దెబ్బతిన్న బ్రిడ్జి పక్క నుంచి తాత్కాలికంగా మట్టి రోడ్డు నిర్మించి 20 రోజుల తర్వాత ప్రయాణాలకు అనుమతించారు. హవేళిఘణాపూర్ మండలంలో దెబ్బతిన్న రహదారులకు తాత్కాలిక మరమ్మతులు నిర్వహించారు. చౌట్లపల్లి వద్ద లోలెవర్ కల్వర్టు దెబ్బతింది. ఇదే విషయమై ఆయా శాఖల అధికారుల వివరణ కోరగా.. నిధులు మంజూరైతే తప్ప ఏమి చేయలేమని నిస్సహాయత వ్యక్తం చేశారు.
చల్మెడ వద్ద దెబ్బతిన్న కల్వర్టుకు అడ్డంగా బోర్డు ఏర్పాటు
కోతకు గురైన లక్ష్మాపూర్– దంతేపల్లి రోడ్డు
దెబ్బతిన్న రోడ్లు, చెరువు కట్టలకు మరమ్మతులేవీ?
రెండు నెలలు గడిచినా చర్యలు శూన్యం
ఇబ్బంది పడుతున్న ప్రజలు
పట్టించుకోని అధికారులు
ఎప్పుడు దారి కొచ్చేనో?
ఎప్పుడు దారి కొచ్చేనో?
ఎప్పుడు దారి కొచ్చేనో?


