కిక్కులక్కు ఎవరికో?
● దరఖాస్తుదారుల్లో టెన్షన్
● నేడే మద్యం దుకాణాల లక్కీ డ్రా
● జిల్లాలోని 49 వైన్స్‌లకు 1,420 అప్లికేషన్లు
జిల్లాలో మద్యం దుకాణాల ఏర్పాటుకు దరఖాస్తు చేసుకున్న వారిలో ఉత్కంఠ నెలకొంది. కిక్కు, లక్కు తమను వరిస్తుందా..? లేదా అని సోమవారం తీసే లక్కీ డ్రాపై గంపెడాశలతో ఎదురుచూస్తున్నారు. డ్రాను పారదర్శకంగా నిర్వహించేందుకు ఎకై ్సజ్ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. – మెదక్‌జోన్
జిల్లావ్యాప్తంగా 49 వైన్స్‌లు ఉండగా, రెండు విడతల అవకాశం.. నెల రోజుల సమయం ఇచ్చినా 1,420 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. గతంలో కంటే 485 అప్లికేషన్లు తగ్గాయి. అయితే దరఖాస్తు ఫీజు రూ. 3 లక్షలకు పెంచడంతో రూ. 42.60 కోట్ల ఆదాయం సమకూరింది. గతంలో కంటే రూ. 4.50 కోట్లు ఎక్కువగా వచ్చింది. జిల్లాలోనే పోతం్‌శెట్టిపల్లి వైన్స్‌కు అత్యధికంగా 54 దరఖాస్తులు వచ్చాయి. ఏడుపాయల దేవస్థానం సమీపంలో ఉండటంతో ఇక్కడ పెద్దఎత్తున మద్యం విక్రయాలు జరుగుతాయి. ఆది, మంగళవారం సుమారు రూ. 25 నుంచి రూ. 30 లక్షల లిక్కర్ వ్యాపారం సాగుతోంది. అంతే కాకుండా ఈ వైన్స్ నుంచి ఏడుపాయల సమీపంలో గల బెల్ట్‌షాపుల నిర్వాహకులు లిక్కర్ కొనుగోలు చేస్తారు. దీంతో మిగితా దుకాణాలతో పోలిస్తే అత్యధికంగా గిరాకీ ఉండటంతో భారీ డిమాండ్ ఏర్పడింది. అలాగే అతి తక్కువగా నిజాంపేట వైన్స్‌కు కేవలం 15 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. ఇక్కడ రెండు మద్యం దుకాణాలు ఉండగా, ఒకదానికి 19 వచ్చాయి. మద్యం విక్రయాలు సైతం అంతంత మాత్రంగానే జరుగుతాయి. నిజాంపేట నుంచి ఐదు కిలోమీటర్ల వ్యవధిలోనే 6 మద్యం దుకాణాలు ఉండటంతో లిక్కర్ వ్యాపారం పెద్దగా జరగదనే వాదన ఉంది. దీంతో ఇక్కడ టెండర్ వేసేందుకు దరఖాస్తుదారులు పెద్దగా ఆసక్తి చూపలేదని తెలిసింది.
ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న లక్కీ డ్రాను పారదర్శకంగా నిర్వహించేందుకు ఎకై ్సజ్ అధికారులు ఏర్పా ట్లు పూర్తి చేశారు. పాస్ ఉన్న వారిని మాత్రమే అధికారులు లోపలికి అనుమతించనున్నారు. లక్కీ డ్రా మొత్తం వీడియో రికార్డు చేయనున్నారు. ఇదిలా ఉండగా తమకే మద్యం దుకా ణాలు దక్కాలని ఆలయాల్లో దరఖాస్తుదారులు ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.


