దాచుకున్న మా డబ్బులు ఇవ్వరా..?
● టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు నరేందర్ ● తక్షణమే పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని డిమాండ్
మెదక్ కలెక్టరేట్: ప్రభుత్వం వద్ద తాము దాచుకున్న సొంత డబ్బులు రాక ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు అనేక ఇబ్బందులు పడుతున్నారని టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు దొంత నరేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం స్థానిక టీఎన్జీవో భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉద్యోగుల పెండింగ్ బిల్లులు, బకాయి పడ్డ ఐదు విడతల కరువు భత్యం విడుదల చేయడం పట్ల రాష్ట్ర ప్రభుత్వం తాత్సారం చేస్తోందని మండిపడ్డారు. తక్షణమే పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విశ్రాంత ఉద్యోగులు పదవీ విరమణ పొంది 19 నెలలు గడుస్తున్నా ఇప్పటికీ వారు దాచుకున్న పీఎఫ్ డబ్బులు వారికి రావాల్సిన ప్రయోజనాలు ఈరోజు వరకు చేకూరలేదని అన్నారు. విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేస్తున్న ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా ప్రభుత్వం ఉద్యోగుల పట్ల నిర్లక్ష్య వైఖరి విడనాడాలని, ఉద్యోగులు దాచుకున్న సొమ్ము తక్షణమే విడుదల చేయాలని కోరారు. సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి అనురాధ, ఇక్బాల్ పాషా, ఫణి రాజ్, ఫజులుద్దీన్, రఘునాథరావు, శివాజీ, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.


