కొనుగోళ్ల జాడేది? | - | Sakshi
Sakshi News home page

కొనుగోళ్ల జాడేది?

Oct 20 2025 9:18 AM | Updated on Oct 20 2025 9:18 AM

కొనుగ

కొనుగోళ్ల జాడేది?

రెక్కలు ముక్కలు చేసుకొని మొక్కజొన్న పండించిన రైతులు పంటను అమ్ముకునేందుకు అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో ఇదే అదనుగా దళారులు నిండా ముంచుతున్నారు. దీనికి తోడు తూకంలో మోసాలకు పాల్పడుతున్నారు. వ్యాపారస్తులు సిండికేట్‌గా మారి మద్దతు ధర అమాంతం తగ్గించడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. – రామాయంపేట(మెదక్‌)

జిల్లావ్యాప్తంగా సుమారుగా 3 వేల ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగవుతోంది. గత ఆగస్టులో కురిసిన భారీ వర్షాలకు పంట తీవ్రంగా దెబ్బతింది. పంట దిగుబడి 30 శాతం మేర తగ్గడంతో పాటు చేలల్లో నీరు నిలిచి మొక్కజొన్నలు మొలకలెత్తి రంగు మారాయి. అష్టకష్టాల మీద రైతులు పంటను కోసి జూడు తీశారు. రంగు మారిన కంకులు మొలకలెత్తడంతో మార్కెట్‌లో తక్కువ ధరకే వ్యాపారస్తులు తీసుకుంటున్నారు.

మార్క్‌ఫెడ్‌ జాడ ఎక్కడ..?

పంట దెబ్బతిని నష్టపోయిన బాధిత రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరించిందనే ఆరోపణలున్నాయి. జిల్లా పరిధిలో మొక్కజొన్నల కొనుగోలు నిమిత్తం మార్క్‌ఫెడ్‌ సంస్థ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో విధిలేని పరిస్థితుల్లో రైతులు దళారులను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదనుగా వారు మోసాలకు పాల్పడుతున్నారు. మొక్కజొన్నలకు ప్రభుత్వ మద్దతు ధర రూ. 2,400 ప్రకటించగా, దళారులు కుమ్మకై రూ. 1,800 కొనుగోలు చేస్తున్నారు. డీసీఎంలో తూకం యంత్రంతో పాటు హమాలీలను తీసుకొని గ్రామాలకు వస్తున్న దళారులు రైతులను మోసం చేస్తున్నారు. క్వింటాల్‌కు కేజీ నుంచి కేజీన్నర తరుగు తీస్తూ దోపిడీ చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు ఎంతమాత్రం పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి.

మెదక్‌జోన్‌: అతివృష్టితో వేలాది ఎకరా ల పంటలు ధ్వంసం కాగా, చేతికందిన కొద్దిపాటి పంట ఉత్పత్తులను సకాలంలో అమ్ముకోవడానికి రైతులు అష్టకష్టా లు పడుతున్నారు. కొనుగోలు చేయాల్సిన యంత్రాంగం పట్టించుకోవడం లేదు. ఫలితంగా రైతులు ప్రైవేట్‌ వ్యా పారులను ఆశ్రయిస్తున్నారు. వచ్చిన కాడికి అమ్ముకొని తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారు.

37,200 ఎకరాల్లో పత్తి సాగు

జిల్లాలో వరి తర్వాత అత్యధికంగా పత్తి సాగవుతోంది. ముఖ్యంగా ఈ పంటను నల్లరేగడి భూముల్లో వర్షాధారంగా సాగుచేస్తారు. టేక్మాల్‌, అల్లాదుర్గం, రే గోడ్‌, పెద్దశంకరంపేట మండలాలతో పాటు కొంత మేర చేగుంట మండలంలోనూ రైతులు సాగు చేశారు. ఈ సీజన్‌లో 37,200 ఎకరాల్లో పత్తి సాగు కాగా, అతివృష్టితో చాలా వరకు పంట దెబ్బతింది. మిగిలిన పంట చేతికందటంతో ప్రస్తుతం పత్తి ఏరుతున్నారు. కాగా జిన్నింగ్‌ మిల్లుల ద్వారా కొనుగోలు చేయాల్సి ఉండగా, ఇప్పటివరకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు కాలేదు. ప్రభుత్వ మద్దతు ధర క్వింటాల్‌కు రూ. 8,100 ఉండగా, ప్రైవేట్‌ వ్యాపారులు రూ. 6 వేల చొప్పున కొనుగోలు చేస్తున్నట్లు తెలిసింది. త్వరగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని రైతు లు డిమాండ్‌ చేస్తున్నారు.

ప్రారంభం కాని తూకం

ఖరీఫ్‌ సీజన్‌లో వరి 3.5 లక్షల ఎకరాల్లో వరి సాగు కాగా, 4.20 లక్షల మెట్రిక్‌ టన్నుల దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. ఇందుకోసం 498 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. అందులో 98 కేంద్రాల ద్వారా సన్నరకం ధాన్యం, 400 సెంటర్ల ద్వారా దొడ్డురకం ధాన్యం కొంటామని చెప్పారు. ఇందులో భాగంగా ఇప్పటివరకు 476 సెంటర్లను జిల్లావ్యాప్తంగా ప్రారంభించారు. కానీ తూకం (కాంటాలు) ఎప్పుడు ప్రారంభించలేదు. దీంతో రైతులు పంటలు కోసి ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే 100 సెంటర్లకుపైగా రైతులు ధాన్యం తరలించి ఆరబెట్టారు. గత రెండు, మూడు రోజులుగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. చల్లటి గాలులు వీయటం, మబ్బులు పడుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. త్వరగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రభుత్వ ప్రకటించిన మద్దతు ధరకు పంటలను కొనుగోలు చేయాలని కోరుతున్నారు. ఇదే విషయమై సివిల్‌ సప్‌లై జిల్లా మేనేజర్‌ జగదీశ్‌ కుమార్‌ను వివరణ కోరగా.. వరి ధాన్యాన్ని దీపావళి తర్వాత తూకం వేస్తామని తెలిపారు.

రైతులు తొందర పడొద్దు

తొందరపడి రైతులు తక్కువ ధరకు మొక్కజొన్నలు విక్రయించొద్దు. ప్రభుత్వ మద్దతు ధర రూ. 2,400 ఉంది. ఈరెండు, మూడు రోజుల్లో రామాయంపేట, తూప్రాన్‌, నర్సాపూర్‌లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తాం.

– క్రాంతి, డీఎం, మార్క్‌ఫెడ్‌

భారీ వర్షాలతో నష్టపోయాం

భారీ వర్షాలతో మొక్కజొన్న పంట దెబ్బతింది. మక్కులు రంగుమారాయి. పెట్టిన పెట్టుబడులు సైతం నష్టపోయాం. ఆదుకుంటామన్న అధికారులు పత్తాలేరు. విధిలేని పరిస్థితుల్లో దళారులకు తక్కువ ధరకు విక్రయించాం.

– స్వామి, రైతు, శివాయపల్లి

పత్తా లేని పత్తి, ధాన్యం కొనుగోలు కేంద్రాలు

భయపెడుతున్న వాతావరణ మార్పులు

పట్టించుకోని అధికారులు

కొనుగోళ్ల జాడేది?1
1/2

కొనుగోళ్ల జాడేది?

కొనుగోళ్ల జాడేది?2
2/2

కొనుగోళ్ల జాడేది?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement