
సీపీఆర్‌తో శ్రీరామ రక్ష
అవగాహన అవసరం
జిల్లాలో నేటి నుంచి అవగాహన కార్యక్రమాలు
మెదక్‌జోన్: మరణం ఎప్పుడు ఎలా వస్తుందో.. ఎవరూ చెప్పలేరు. అప్పటివరకు నవ్వుతూ కనిపించిన వారే కళ్ల ముందు కుప్పకూలుతుంటారు. రెప్పపాటులో కళ్లు మూస్తుంటారు. గుండెపోటుతో తరు చూ ఇలాంటి సంఘటనలు మనం చూస్తున్నాం. అయితే గుండెపోటు వచ్చిన వారిని సీపీఆర్ (కార్డి యో పల్మోనరీ రిససిటేషన్)తో సకాలంలో కాపాడవచ్చని వైద్యులు చెబుతున్నారు. ఈ మేరకు ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించేందుకు వైద్యారోగ్యశాఖ శ్రీకారం చుట్టింది. సోమవారం నుంచి 17వ తేదీ వరకు జిల్లాలో ప్రత్యేకంగా శిక్షణ పొందిన వైద్యులతో అవగాహన కల్పించేందుకు చర్యలు చేపట్టింది.
వైద్యులకు ప్రత్యేక శిక్షణ
ఉరుకుల పరుగుల జీవితంలో మూడు పదుల వయసులోనే బీపీ, షుగర్‌తో పాటు ఎన్నో రకాల వ్యాధుల బారిన పడుతున్నారు. ముఖ్యంగా వయస్సుతో సంబంధం లేకుండా గుండె సమస్యలు ఎక్కువవుతున్నాయి. అవి మరణాలకు దారి తీస్తున్నాయి. ఈ మధ్యకాలంలో గుండె సమస్యలతో సంభవిస్తున్న మరణాల్లో యువతే ఎక్కువగా ఉంటున్నారని పలు అధ్యయనాలు తేల్చాయి. అయితే గుండెపోటు, ప్రమాదాలు వంటివి జరిగినప్పుడు స్పృహ కోల్పోయిన లేదా శ్వాస తీసుకోని వారికి అత్యవసర సమయంలో సీపీఆర్ ఇవ్వడం ద్వారా వారి ప్రాణాలు నిలబెట్టే అవకాశం ఉంది. పోలీసులు, ఇతర సామాన్యులు కూడా సీపీఆర్ చేసి ప్రాణాలను కాపాడిన సంఘటనలు అనేకం ఉన్నా యి. జిల్లాలో ఇటీవల ఓ పోలీస్ కానిస్టేబుల్ మహిళ ప్రాణాన్ని కాపాడారు. ఈక్రమంలో వైద్యారోగ్యశాఖ సీపీఆర్‌పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు జిల్లాకు చెందిన వైద్యులకు ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చింది. ఇందులో చేగుంట పీహెచ్‌సీ వైద్యుడు అనిల్, వెల్దుర్తి పీహెచ్‌సీ వైద్యురాలు సౌజన్య, రెడ్డిపల్లి డాక్టర్ ఫర్నాజ్, సర్దన పీహెచ్‌సీ వైద్యుడు వినయ్‌సుశీల్ ఉన్నారు. వీరితో పాటు 108 సిబ్బంది అవగాహన కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. జిల్లాలో ఈనెల 13 నుంచి 17వ తేదీ వరకు ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, జన సంచారం ఎక్కువగా ఉన్న రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు, షాపింగ్‌మాల్స్, వైద్యారోగ్య సెంటర్లలో అధికారులు విస్తృతంగా ప్రజలకు అవగాహన కల్పించనున్నారు.
సీపీఆర్‌పై ప్రతి ఒక్కరూ విధిగా అవగాహన కలిగి ఉండాలి. అకస్మాత్తుగా గుండె కొట్టుకోవటం ఆగి శ్వాస నిలిచిపోయిన వ్యక్తులకు వెంటనే సీపీఆర్ చేస్తే 60 శాతం బతికే అవకాశం ఉంటుంది. ప్రభు త్వం దీనిపై విస్తృతంగా అవగాహన కల్పించేందుకు చర్యలు చేపట్టింది.
– గణేశ్వర్, ప్రోగ్రాం కో–ఆర్డినేటర్, మెదక్

సీపీఆర్‌తో శ్రీరామ రక్ష