
వరద నష్టం రూ.262 కోట్లు
జిల్లాలో అత్యధికంగా
రోడ్లు, బ్రిడ్జిలు ధ్వంసం
మెదక్‌జోన్: మెతుకుసీమలో భారీ వర్షాలు, వరదలు మిగిల్చిన నష్టం అంతా ఇంతా కాదు. రోడ్లు, బ్రిడ్జిలు ధ్వంసం కాగా, చెరువులు, కుంటలు తెగిపోయాయి. అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పంట పొలాలు నీట మునిగాయి. వే లాది ఎకరాల్లో ఇసుక మేటలు పేరుకుపోయాయి. పలు ఇళ్లు నేలమట్టం కాగా, ఆస్తి, ప్రాణనష్టం సంభవించింది. కాగా వరద నష్టాన్ని అంచనా వేసేందుకు జిల్లాలో ఇటీవల కేంద్ర బృందం విస్తృతంగా పర్యటించింది. సుమారు రూ. 262.76 కోట్ల నష్టం వాటిల్లినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.
● జిల్లావ్యాప్తంగా ఆర్‌అండ్‌బీ రోడ్లు 307 కిలోమీటర్ల మేర ధ్వంసం కాగా, లోలెవెల్, హైలెవెల్ బ్రిడ్జిలు వరదల్లో కొట్టుకుపోయాయి. వీటి తాత్కాలిక మరమ్మతుల కోసం అత్యవసరంగా రూ. 2.56 కోట్లు అవసరం ఉండగా, పర్మనెంట్ పనులు చేసేందుకు రూ. 144 కోట్లు కావాలి.
● పంచాయతీరాజ్‌శాఖ పరిధిలో 167 కిలోమీటర్ల మేర రోడ్లు, బ్రిడ్జిలు ధ్వంసం కాగా, ఇందుకోసం రూ. 67 కోట్లు అత్యవసరంగా మంజూరు చేస్తే రోడ్ల మరమ్మతులు చేయాల్సి ఉంటుంది.
● వరదల కారణంగా జిల్లాలో 218 చెరువులు, కుంటలు, నీటి కాలువలు, ఘనపూర్ ప్రాజెక్టు కెనాల్స్‌తో పాటు పంటలకు సాగు నీరందించే అనేక కాలువలు దెబ్బతిన్నాయి. వీటిలో అత్యవసరంగా 67 చెరువులు, కుంటలకు మరమ్మతులు చేయాల్సి ఉంది. వీటి కోసం రూ. 3.16 కోట్లు కావాల్సి ఉందని, పర్మనెంట్ పనులు చేసేందుకు రూ. 22.44 కోట్లు అవసరం ఉందని ఇరిగేషన్‌శాఖ అంచనా వేసింది.
● జిల్లాలో వరదల కారణంగా 6,470 ఎకరాల్లో పంటలు ధ్వంసం అయ్యాయి. వాటిలో 1,200 ఎకరాల్లో ఇసుక మేటలు పేరుకుపోగా, మిగితా 5,270 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ప్రభుత్వం రైతులకు ఎకరాకు రూ. 10 వేల చొప్పున ఇన్‌పుట్ సబ్సిడీ ఇచ్చినా రూ. 6.47 కోట్లు చెల్లించాల్సి ఉంది. పరిహారం త్వరగా చెల్లించాలని రైతులు కోరుతున్నారు.
● వరద ఉధృతికి 3,500 విద్యుత్ స్తంభాలు దెబ్బతినగా, 646 ట్రాన్స్‌ఫార్మర్లు, ఒక సబ్‌స్టేషన్ నీటిలో మునిగిపోయింది. దీంతో విద్యుత్‌శాఖకు రూ. 13.50 కోట్ల నష్టం వాటిల్లింది.
● భారీ వర్షాల కారణంగా మెదక్ పట్టణంలోని బాలికల రెసిడెన్షియల్ పాఠశాల, తూప్రాన్‌లోని బాలుర రెసిడెన్షియల్ పాఠశాలలు దెబ్బతిన్నాయి. నూతన భవనాల నిర్మాణానికి రూ. 2.13 కోట్లు అవసరం ఉన్నట్లు విద్యాశాఖ పేర్కొంది.
వేలాది ఎకరాల్లో పంటలకు నష్టం
తెగిన చెరువులు, కుంటలు
స్వయంగా పరిశీలించిన కేంద్ర బృందం
ఏడుపాయల వనదుర్గామాత ఆలయం ఆగస్టు 14 నుంచి మొదలుకుని నేటి వరకు వరద ఉధృతిలోనే ఉంది. సింగూరు నీటిని దిగువకు వదలటంతో భారీగా వరద వస్తోంది. ఆలయానికి సుమారు రూ. 1.50 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు సంబంధిత అధికారులు అంచనా వేశారు.