
హస్తవాసి ఎవరికో!
● డీసీసీ రేసులో ఆ నలుగురు
● 11న ఏఐసీసీ పరిశీలకుల రాక
● క్షేత్రస్థాయిలో పర్యటన, వారం రోజుల్లో నివేదిక
మెదక్ అర్బన్: సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ సన్నాహాలు ప్రారంభించింది. నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయం కుదిర్చి, ఏకాభిప్రాయంతో సమర్థుడైన డీసీసీ అధ్యక్షుడిని నియమించేందుకు చర్యలు చేపట్టింది. ఈమేరకు ఈనెల 11న ఏఐసీసీ నుంచి 22 మంది పరిశీలకులు జిల్లాకు రానున్నట్లు తెలిసింది. క్షేత్రస్థాయిలో పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించి, అందరి అభిప్రాయాలు సేకరించి, సమగ్రమైన నివేదికను ఏఐసీసీకి అందజేయనున్నట్లు సమాచారం. కాగా డీసీసీ అధ్యక్ష పదవికి జిల్లాలో తీవ్ర పోటీ నెలకొంది. ప్రధానంగా నలుగురు నాయకుల పేర్లు వినిపిస్తున్నప్పటికీ, మరికొందరు అధ్యక్ష పీఠంపై ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది.
ఆంజనేయులుగౌడ్
నర్సాపూర్ మండలం రెడ్డిపల్లికి చెందిన ఆంజనేయులుగౌడ్ విద్యార్థి దశ నుంచి ఎన్‌ఎస్‌యూఐలో పలు పదవులు చేపట్టి, చురుకై న నాయకుడిగా రాజకీయ ఆరంగ్రేటం చేశారు. ఒకసారి ఎంపీటీసీగా పని చేశారు. ఆయన తల్లి, సోదరులు సొంత గ్రామా నికి సర్పంచ్‌లుగా సేవలందించారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో అప్పటి డీసీసీ అధ్యక్షుడు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి బీఆర్‌ఎస్‌లో చేరడంతో ఆంజనేయులుగౌడ్‌కు పార్టీ డీసీసీ బాధ్యత లు అప్పగించింది. అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థి విజయం కోసం కృషి చేశారు. మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావుకు అనుంగు అనుచరుడిగా కొనసాగుతున్నారు. రెండోసారి డీసీసీ పదవిని ఆశిస్తున్నారు.
ఆవుల రాజిరెడ్డి
మాసాయిపేట మండల కేంద్రానికి చెందిన ఆవుల రాజిరెడ్డి కుటుంబీకులు ఆది నుంచి కాంగ్రెస్‌వాదులే. ఆయన తండ్రి నారాయణరెడ్డి మాసాయిపేట ఎఫ్‌ఏసీఎస్ చైర్మన్‌గా రెండుసార్లు పనిచేశారు. విద్యాధికుడైన రాజిరెడ్డి లాయర్‌గా హైదరాబాద్‌లో పని చేస్తూనే, నర్సాపూర్ నియోజకవర్గంలో సునీతారెడ్డి అనుచరుడిగా కొనసాగారు. 2019లో సునీతారెడ్డి కాంగ్రెస్‌ను వీడిన తర్వాత, కష్టకాలంలో నర్సాపూర్ నియోజకవర్గ బాధ్యతలు చేపట్టారు. పీసీసీ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి పార్టీ పటిష్టతకు కృషి చేశారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి సునీతారెడ్డి చేతిలో ఓడిపోయారు. నియోజకవర్గ ఇన్‌చార్జిగా కొనసాగుతున్న ఆయన ప్రస్తుతం డీసీసీ అధ్యక్ష రేసులో ఉన్నారు.
పబ్బతి ప్రభాకర్‌రెడ్డి
పాపన్నపేట మండలం ఎల్లాపూర్‌కు చెందిన పబ్బతి ప్రభాకర్‌రెడ్డి 24 ఏళ్ల వయస్సులో పోలింగ్ ఏజెంట్‌గా రాజకీయ రంగంలోకి అడుగుపెట్టారు. ఇప్పటికీ ప్రతి ఎన్నికలో ఆయనే ఏజెంట్‌గా విధులు నిర్వహించడం విశేషం. 1998లో రాజశేఖర్‌రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు మండలస్థాయిలో కార్యకర్తలు పాదయాత్ర నిర్వహించారు. ఈసందర్భంగా జరిగిన సమావేశంలో ప్రభాకర్‌రెడ్డి ఇచ్చిన స్పీచ్‌కు ఆకర్షితులైన కాంగ్రెస్ నాయకులు మండల యువజన కాంగ్రెస్ అధ్యక్ష పదవిని కట్టబెట్టారు. అనంతరం ఏడేళ్ల పాటు మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా సేవలందించారు. సీడీసీ డైరెక్టర్, ఏడుపాయల చైర్మన్, ఫారెస్ట్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ నాన్ అఫీషియల్ మెంబర్, డీసీసీ ప్రధాన కార్యదర్శిగా, సర్పంచ్‌గా, కిసాన్‌సెల్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. పార్టీ కార్యక్రమాలపై పట్టున్న ఆయన డీసీసీ అధ్యక్ష పదవిని ఆశిస్తున్నారు.
సుప్రభాత్‌రావు
రామాయంపేటకు చెందిన సుప్రభాత్‌రావు విద్యార్థి దశ నుంచి కాంగ్రెస్‌లో కొనసాగుతున్నారు. యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా, ఉపాధ్యక్షుడిగా యువతను ఆకట్టుకుంటూ పార్టీ నిర్మాణానికి కృషి చేశారు. 25 ఏళ్లుగా పీసీసీ మెంబర్‌గా పని చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో డీసీసీ అధ్యక్షుడు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి బీఆర్‌ఎస్‌లోకి వెళ్లిన తర్వాత డీసీసీ పదవిని ఆశించారు. అప్పట్లో పదవి వస్తుందనుకున్న తరుణంలో ఆంజనేయులుగౌడ్‌ను వరించింది. ప్రస్తుతం అవకా శం వస్తే స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారు.