
భగీరథ నీళ్లు బంద్
● పైప్‌లైన్ పగిలి 10 రోజులుగా నిలిచిన నీటి సరఫరా ● దాహార్తిలో ఆరు మండలాల్లోని 449 గ్రామాలు ● మరమ్మతులకు మరో పది రోజులు పట్టవచ్చంటున్న అధికారులు
హత్నూర(సంగారెడ్డి)/నర్సాపూర్: పుల్కల్ మండలం వెండికొలు గ్రామ శివారులో పదిరోజుల క్రితం మంజీరా నది నీటిలో పైప్‌లైన్ పగిలిపోయింది. దీంతో హత్నూర, జిన్నారం, గుమ్మడిదలతోపాటు మెదక్ జిల్లా నర్సాపూర్, శివంపేట కౌడిపల్లి ఆరు మండలాల్లో 449 గ్రామాలకు నీటి సరఫరా నిలిచిపోయింది. గ్రామాల్లో ఉండే రక్షిత మంచినీటి బోర్లను కనీసం మరమ్మతులు చేయకపోవడంతో నీళ్లు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గతంలో నీటి సరఫరా చేసే బోర్లున్నప్పటికీ వాటికి మోటార్లు లేకపోవడం, మరమ్మతులు చేయించకపోవడంతో అవి నిరుపయోగంగా మారా యి. దీంతో ప్రజలు నీటి కోసం వ్యవసాయ బోరు బావులను ఆశ్రయిస్తున్నారు. నర్సాపూర్, దౌల్తాబాద్, పట్టణాలలో కొంతమంది నాయకులు వాటర్ ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నప్పటికీ ప్రజలకు సరిపోవడం లేదు. పైప్‌లైన్ మరమ్మతులు చేసేంతవరకై నా తాగునీటికి కనీసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లైనా చేయా లని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
సమస్య పరిష్కరించాలని వినతి
తాగు నీటి సమస్యను పరిష్కరించాలని జిల్లా ఇన్‌చార్జి మంత్రి వివేక్‌ను నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి ఆవుల రాజిరెడ్డి కోరారు. ఈమేరకు శుక్రవారం మంత్రిని కలిసి నియోజకవర్గంలో నీటి సమస్యను వివరించారు. నీటి సమస్యను పరిష్కరించేందుకు గోదావరి జలాలను కోమటిబండ నుంచి ప్రత్యేక పైపులైన్ ద్వారా శివ్వంపేటలోని సంప్‌కు మళ్లించి నియోజకవర్గ ప్రజలకు నీటి సరఫరా చేపట్టాలని కోరారు.
నీరు తగ్గుముఖం పడితేనే..
పైపులైన్ పగిలిపోవడంతో గ్రామాలకు గత పది రోజులుగా నీరు రావడం లేదు. మంజీరాలో నీళ్లు తగ్గితే పైపులైన్‌కు మరమ్మతు చేయడానికి వీలవుతుంది. ప్రజలు ఇబ్బంది పడుతున్న మాట వాస్తవమే. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాం.
– రఘువీర్,
జిల్లా మిషన్ భగీరథ చీఫ్ ఇంజనీర్

భగీరథ నీళ్లు బంద్