
అభ్యర్థుల ఉత్సాహంపై నీళ్లు
● నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను షురూ చేసినట్లు ప్రకటించిన ఆర్‌ఓలు ● తీరా బీసీ రిజర్వేషన్ల జీఓపైస్టే విధించిన హైకోర్టు ● వాయిదా పడిన స్థానిక సంస్థల ఎన్నికలు
మెదక్‌జోన్: స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి గురువారం ఆసక్తిరమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. తొలి విడతలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు గురువారం ఉదయం 10.30 గంటల నోటిఫికేషన్ జారీ అయింది. ఆ వెంటనే నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు రిటర్నింగ్ అధికారులు ప్రకటించారు. తీరా సాయంత్రం బీసీల రిజర్వేషన్లకు సంబంధించిన జీఓ నంబర్ 9పై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం స్టే విధించింది. ఎన్నికల నిర్వహణ ప్రక్రియ సైతం వాయిదా పడింది. దీంతో ఎన్నికల్లో పోటీకి సిద్ధమైన అభ్యర్థుల ఉత్సాహంపై నీళ్లు చల్లినట్లయింది. ఆశావహులకు నిరాశే మిగిలింది. రిజర్వేషన్లు కలిసి రాని నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
అయోమయం.. ఉత్కంఠ
స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జీఓ నంబర్ 9ని జారీ చేసింది. ఈ జీఓను రద్దు చేయాలని, మద్దతుగా పలువురు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ పిటీషన్లపై విచారణ చేపట్టిన హైకోర్టు గురువారం జీఓ 9పై స్టే విధించింది. కౌంటర్లు దాఖలు చేసేందుకు ప్రభుత్వానికి, పలువురు పిటీషనర్లకు ఆరువారాల పాటు గడువు ఇచ్చింది. దీంతో ఎన్నికల ప్రక్రియకు తాత్కాలికంగా బ్రేక్ పడినట్లయింది. అయితే ఈ ఎన్నికల్లో పోటీకి సిద్ధమైన నాయకుల్లో ముందు నుంచి అయోమయమే నెలకొంది. ఎన్నికల విషయంలో కోర్టు ఎలాంటి తీర్పును ఇ స్తుంది. అనే దానిపై ఉత్కంఠగా ఎదురు చూశారు. రిజర్వేషన్లు అనుకూలించిన వారు పోటీకి సిద్ధమయ్యారు. నామినేషన్ వేసేందుకు అవసరమైన పత్రాలను సిద్ధం చేసుకున్నారు. మరోవైపు ప్రధాన రాజకీయ పార్టీలు కూడా అభ్యర్థిత్వం ఎంపికపై కసరత్తు చేశాయి. కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ నియోజకవర్గాల ఇన్‌చార్జిలు, నాయకులు పార్టీ శ్రేణులను ఎన్నికలకు సన్నద్ధం చేశాయి.ఈ నేపథ్యంలో గురువారం రిటర్నింగ్ అధికారులు నోటిఫికేషన్ ఇచ్చా రు. కోర్టు విచారణ నేపథ్యంలో నామినేషన్ వేసేందుకు ఎవరూ ఆసక్తి చూపలేదు.