
సింగూరు నీరు విడుదల
పుల్‌కల్(అందోల్): సింగూరు ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరగడంతో ఒక గేట్‌ను ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. గత రెండు రోజులుగా ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో 9వ నంబర్ గేట్‌ను మీటరున్నర ఎత్తుకు ఎత్తి దిగువకు 7262 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. జలవిద్యుత్ కేంద్రం నుంచి 2500 క్యూసెక్కుల నీటితో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. ప్రాజెక్టులోకి 9230 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా.. ఔట్‌ఫ్లో 9675 క్యూసెక్కులని అధికారులు తెలిపారు. ప్రస్తుతం డ్యాంలో 17.345 టీఎంసీలు నిల్వ ఉంచి, మిగితా నీటిని దిగువకు వదులుతున్నారు.
ఏడుపాయల ఆలయం మూసివేత
పాపన్నపేట(మెదక్): ఏడుపాయల వన దుర్గమ్మ ఆలయాన్ని శనివారం మళ్లీ మూసివేశారు. సింగూరు నుంచి 9675 క్యూసెక్కుల నీటిని దిగువకు వదలడంతో ఘనపురం ఆనకట్ట పొంగి పొర్లుతోంది. ఆలయం ఎదుట నుంచి వరద వెళ్తుండటంతో ఇరిగేషన్ అధికారుల సూచన మేరకు ఆలయాన్ని మూసివేశారు. అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని రాజగోపురంలో ఉంచి పూజలు చేస్తున్నారు. అదనపు కలెక్టర్ నగేశ్, అదనపు ఎస్పీ మహేందర్ వేర్వేరుగా అమ్మవారికి పూజలు చేసి మంజీరా వరదను పరిశీలించారు. అటు వైపు ఎవరూ వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
అంధ విద్యార్థికి
ఆర్థిక సాయం
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మరోసారి దాతృత్వాన్ని చాటుకున్నారు. కామారెడ్డి జిల్లా గాంధారి మండలం లొంక తండాకు చెందిన అంధ బాలుడు వికాస్ నాయక్ నిజామాబాద్‌లోని అంధుల పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్నాడు. మూడేళ్ల వయస్సులోనే చూపు కోల్పోయాడు. తండ్రి రెండు కిడ్నీలు పాడయ్యాయి. ఈ నిరుపేద కుటుంబం శనివారం జగ్గారెడ్డి వద్దకు వచ్చి తమ గోడు వెల్లబోసుకోగా, వైద్య ఖర్చుల కోసం వికాస్‌కు రూ. 7.50 లక్షల నగదు అందజేశారు. వికాస్ కొమురవెల్లి మల్లన్న, బీరప్ప, సీతారామచంద్రులు వంటి ఆధ్యాత్మిక, పౌరాణిక గాయాలు పాడటంలో ప్రావీణ్యం సంపాదించారు. కాగా అతడికి కొత్త సెల్‌ఫోన్ అందజేసి, యూట్యూబ్ చానెల్ పెట్టించేందుకు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోపాజి అంనంత కిషన్, కాంగ్రెస్ నాయకులు కూన సంతోష్, కిరణ్ పాల్గొన్నారు.
నియమాలు పాటిద్దాం..
● ప్రమాదాలను నివారిద్దాం
రామాయంపేట(మెదక్): కొత్తగా డ్రైవింగ్ లైసెన్స్, వాహన రిజిస్ట్రేషన్ కార్డులు పొందేవారికి ప్రభుత్వం కొత్త తరహాలో అవగాహన కల్పిస్తోంది. రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేరిట ప్రత్యేకంగా లేఖ ప్రతితో పాటు కార్డులను పోస్టులో పంపుతోంది. మానవ తప్పిదాలతోనే ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.. భద్రతా నియమాలు పాటిద్దాం.. ప్రమాదాలు నివారిద్దామని లేఖలో పేర్కొంది. ఇదే విషయమై జిల్లా రవాణా అధికారి వెంకటస్వామి మాట్లాడుతూ.. జిల్లా పరిధిలో కనీసం 600 మందికిపైగా వాహనదారులకు వాహన రిజిస్ట్రేషన్ కార్డులతో పాటు మంత్రి పేరిట లేఖలు పంపించామని తెలిపారు.

సింగూరు నీరు విడుదల

సింగూరు నీరు విడుదల