
వసతిగృహాల్లో మెనూ పాటించాలి
నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి
నర్సాపూర్: ప్రభుత్వ వసతి గృహాల్లో మెనూ తప్పకుండా పాటించాలని ఎమ్మెల్యే సునీతారెడ్డి అన్నారు. బుధవారం క్యాంపు కార్యాలయంలో ని ర్వహించిన ప్రభుత్వ వసతి గృహాల సలహా కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. వసతి గృహాల్లో ఉండే విద్యార్థుల భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉందని, వారికి ప్రభుత్వం అందిస్తున్న అన్ని సదుపాయాలు అందించాలని సూచించారు. అధికారులు స్థానికంగా ఉండాలని, విద్యార్థులకు ఏమైనా ఇబ్బందులు కల్గిస్తే సహించేది లేదన్నారు. సమస్యలుంటే చెప్పాలని, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని చెప్పారు. కాగా ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించిన కాస్మొటిక్ చార్జీలు విద్యార్థులకు రాకపోవడం విచారకరమన్నారు. సమావేశంలో ఎంఈఓలు బుచ్చానాయక్, తారాసింగ్, ఎస్సీ, ఎస్టీ, బీసీ శాఖల జిల్లా అధికారులు గంగాకిషన్, నీలిమ, పద్మజ, అమరజ్యోతి తదితరులు పాల్గొన్నారు. అనంతరం హత్నూర మండలానికి చెందిన పలువురికి ఎమ్మెల్యే సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు.