
రైతుల సమస్యలు పరిష్కరించాలి
చేగుంట(తూప్రాన్): రాష్ట్ర ప్రభుత్వం రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదని తెలంగాణ వ్యవసాయ సంఘం రాష్ట్ర కార్యదర్శి శోభన్ అన్నా రు. గురువారం చేగుంటలో రైతులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని ప్రకటించినప్పటికీ వ్యవసాయ రుణాలు తగ్గిపోయాయన్నారు. రైతుభరోసా వంటి పథకాలకు డబ్బులు ఎక్కువ కేటాయించడం లేదన్నారు. అమెరికాలో రైతులకు 61 వేల డాలర్లు రాయితీ ఇస్తే భారత్‌లో కేవలం 282 డాలర్లు మాత్రమే ఇవ్వడం సరికాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయ రంగం నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తుండగా, కర్నాటకలో అగ్రి టూరిజం పేరుతో 20 వేల ఎకరాలను బడా బాబులకు అప్పగించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను విస్మరిస్తే రాబోయే రోజుల్లో ఉద్యమాలు నిర్వహిస్తామని హె చ్చరించారు. కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు లక్ష్మీనర్సయ్య, భాస్కర్, సాయి, దివాకర్, రమేశ్, స్వామి, బాలరాజు, అంజయ్యతో పాటు పలు గ్రామాలకు చెందిన రైతులు పాల్గొన్నారు.