అధిక మోతాదుకు చెల్లు | - | Sakshi
Sakshi News home page

అధిక మోతాదుకు చెల్లు

Jun 22 2025 7:18 AM | Updated on Jun 22 2025 7:18 AM

అధిక మోతాదుకు చెల్లు

అధిక మోతాదుకు చెల్లు

ఖేడ్‌లో మట్టి పరీక్ష కేంద్రం ఏర్పాటు
● ఉమ్మడి జిల్లాలో రెండో కేంద్రం ● ఉమ్మడి మెదక్‌ జిల్లా రైతులకు ప్రయోజనం

నారాయణఖేడ్‌: ఎరువులు, రసాయన మందుల విచ్చలవిడి వాడకం ద్వారా నష్టపోతున్న రైతన్నలకు ఉపయోగపడేలా ఉమ్మడి జిల్లాకు మరో మట్టి నమూనా కేంద్రం మజూరైంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలోనే మట్టి నమూనా పరీక్షా కేంద్రం కొనసాగుతోంది. ఉమ్మడి జిల్లాలోని ఏ ప్రాంతం రైతులైనా తమ మట్టి నమూనాలను ఇక్కడే పరీక్షించుకోవాల్సి వస్తుంది. కాగా, ప్రభుత్వం తాజాగా నారాయణఖేడ్‌కు మట్టి పరీక్షా కేంద్రాన్ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకుగాను రూ.1.95కోట్లను విడుదల చేసింది. రూ.1కోటి ద్వారా భవన నిర్మాణం పనులు చేపట్టగా, రూ.95క్షలతో పరికరాలు, గాజు సామగ్రి, రసాయనాలు, ఫర్నీచర్‌, మౌలిక సదుపాయాలు, ఇతర వస్తువుల కొనుగోలుకు వినియోగించనున్నారు. ఈ కేంద్రం పరిధిలో జిల్లాతోపాటు మెదక్‌ జిల్లా పరిధిలోని మండలాల రైతులకు ప్రయోజనం చేకూరనుంది. ఖేడ్‌, అందోల్‌, జహీరాబాద్‌ నియోజకవర్గాలతోపాటు, మెదక్‌ జిల్లాలోని పెద్దశంకరంపేట, రేగోడ్‌, టేక్మాల్‌ తదితర మండలాల రైతులకు అనువుగా ఉండనుంది. ఖేడ్‌ పట్టణ శివారులోని జూకల్‌ శివారులో స్థలాన్ని ఇదివరకే ఎంపిక చేసి ప్రభుత్వానికి ప్రతిపాదించారు. ఆ స్థలంలో భవన నిర్మాణం పనులు చేపట్టనున్నారు. ఈ కేంద్రంలో ఒక ఏడీఏ, ఏవో, ఏఈవోలు, ల్యాబ్‌ టెక్నీషియన్స్‌ను నియమించనున్నారు.

భారీగా ఎరువుల వినియోగం

రాష్ట్రంలో భారీ స్థాయిలో ఎరువుల వినియోగం జరుగుతుందని, ప్రధానంగా యూరియా వినియోగాన్ని తగ్గించేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎరువుల, రసాయనాల మంత్రిత్వ శాఖ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి సూచన చేసింది. యూరియా వినియోగం ఎక్కువవుతోందని, దాని ప్రభావం సాగు భూములపై చూపుతోందని ఆందోళన వ్యక్తం చేసింది. పంజాబ్‌ తర్వాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో రసాయన ఎరువులు, క్రిమిసంహారక పురుగు మందుల వినియోగం మోతాదుకు మించి ఉందని వెల్లడించింది. మట్టి పరీక్షల ద్వారా ఈ సమస్యలను అధిగమించే అవకాశం ఉంది.

ఇవీ ప్రయోజనాలు..

మట్టి పరీక్ష అనేది మట్టిలోని పోషక పదార్థాల స్థాయిలు, పీహెచ్‌ విలువ, ఉప్పు సమతుల్యత, సూక్ష్మపదార్థాల ఉనికి తెలుసుకోవడం వ్యవసాయంలో చాలా కీలకమైన అంశం. మట్టి పరీక్ష పంటకు సరిపోయే ఎరువుల ఎంపికకు సహాయ పడుతుంది. మట్టిలో పోషకాలు ఎక్కువగా ఉన్నాయా, ఏవి కొరతగా ఉన్నాయో తెలుసుకుని అందుకు అవసరమైన ఎరువులను సరిగ్గా వినియోగించుకునే వీలుంది. అనవసర ఎరువుల వినియోగం తగ్గించుకోవచ్చు. ఫలితంగా అవసరానికి మించి ఎరువుల వాడకం వల్ల కలిగే హానిని నివారించుకునే వీలుంది. సమతుల్య పోషకాల నిచ్చెన వల్ల పంట ఆరోగ్యంగా పెరిగి దిగుబడి వస్తుంది. అవసరమైన వాటినే వినియోగించడం వల్ల ఖర్చూ తగ్గుతుంది. మట్టిలో మార్పులను గమనించి భవిష్యత్తులో తగిన పంటలు వేసే అవకాశం కలుగుతుంది. అధిక రసాయనాల వాడకాన్ని నియంత్రించి నేల, నీటి, పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించవచ్చు. కొత్త భూమిలో పంట సాగు ప్రారంభించే ముందు, ప్రతీ రెండు మూడేళ్లకు ఒకసారి, పంట దిగుబడులు తగ్గిన సందర్భాలు, భూమి మార్పు జరిగిన సందర్భాల్లో మట్టి నమూనా పరీక్షలు నిర్వహించుకోవాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement