కర్షకులకు కరెంట్ కష్టాలు
● నిధులు మంజూరైనా ముందుకు సాగని పనులు
● ఆందోళనలో అన్నదాతలు
మెదక్‌జోన్: దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించని చందంగా మారింది అన్నదాతల పరిస్థితి. ఆగస్టు చివరి వారంలో కురిసిన భారీ వర్షాలకు వేలాది ఎకరాల్లో పంటలు నష్టపోయాయి. విద్యుత్ స్తంభాలు, వందలాది ట్రాన్స్‌ఫార్మర్లు, బోరు బావు లు ధ్వంసం అయ్యాయి. స్వయంగా పరిశీలించిన సీఎం రేవంత్‌రెడ్డి బాధితులను వెంటనే ఆదుకోవాలని నిధులు విడుదల చేశారు. అయితే క్షేత్రస్థాయిలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నా రు. ఫలితంగా బోరు బావులకు నేటికీ విద్యుత్ పునరుద్ధరించలేదు. యాసంగి నారుమల్లు పోసే పుణ్య కాలం దాటిపోతుందని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు.
రూ. 6.5 కోట్లు మంజూరు
జిల్లాలో ఈఏడాది ఆగస్టులో పెద్ద ఎత్తున వరదలు వ చ్చాయి. అత్యధికంగా హవేళిఘణాపూర్, పాపన్నపేట, చిన్నశంకరంపేట, రామాయంపేట, నిజాంపేట, మెదక్ తదితర మండలాల్లో తీవ్ర నష్టం జరిగింది. అధికారిక లెక్కల ప్రకారం 10,671 ఎకరాల్లో పంటలు ధ్వంసం కాగా 1,344 విద్యుత్ స్తంభాలు, 460 ట్రాన్స్‌ఫార్మర్లు, మెదక్ పట్టణంలో ఓ సబ్‌స్టేషన్ నీట మునగింది. కిలోమీటర్ల మేర తీగలు కొట్టుకుపోయాయి. పోచమ్మరాల్ గ్రామ శివారులో గల పో చారం ప్రాజెక్టు దిగువన వరద ఉధృతికి వందలాది బోరు బావులు ధ్వంసం అయ్యాయి. బోరుపైపులు విరిగిపోయాయి. స్తంభాలు కొట్టుకుపోయాయి. వరదల కారణంగా విద్యుత్‌శాఖకు జరిగిన నష్టాన్ని పూడ్చేందుకు ప్రభుత్వం ఆశాఖకు రూ. 6.5 కోట్లు మంజూరు చేసింది. వీటితో నూతనంగా స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటు, కొత్త తీగలు ఏర్పాటు చేయడం, నీటి మునిగిన సబ్‌స్టేషన్‌ను మరోచోట నిర్మించాలని నిర్ణయించారు. కాగా పనులను పలువురు కాంట్రాక్టర్లకు అప్పగించి అధికారులు చేతులు దులుపుకున్నారు. పనులు దక్కించుకున్న సదరు కాంట్రాక్టర్లు అక్కడక్కడ కొన్ని విద్యుత్ స్తంభాలను నాటి వదిలేశారు. నష్టం జరిగి మూడు మాసాలు గడిచి పోతున్నా, పనులు పూర్తిస్థాయిలో చేయలేదు. ఫలితంగా బోరుబావులు మూలన పడ్డాయి. యాసంగి నారు ఎలా పోయాలని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి విద్యుత్‌ను త్వరగా పునరుద్ధరించాలని వారు వేడుకుంటున్నారు.
పట్టించుకోవడం లేదు
వరదలతో సర్వం కోల్పోయాం. నష్టపోయిన పంటలకు పరిహారం ఇప్పటివరకు రాలేదు. కనీసం విరిగిన స్తంభాల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేసినా బోరుబావుల కింద తుకాలు పోసుకుంటాం. అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా కనికరించటం లేదు.
– శ్రీనివాస్, రైతు, పోచమ్మరాళ్
త్వరలో పనులు పూర్తి చేస్తాం
వరద నష్టంతో విద్యుత్‌శాఖకు సుమారు రూ. 7 కోట్ల మేర నష్టం జరిగింది. పనుల పునరుద్ధరణ కోసం రూ. 6.5 కోట్లు మంజూరయ్యాయి. ఇప్పటి వరకు 80 శాతం పనులు చేశాం. మిగితా పనులు త్వరలోనే పూర్తి చేస్తాం.
– నారాయణ నాయక్, ఎస్‌ఈ, విద్యుత్‌శాఖ


