నేనిచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వండి
నర్సాపూర్ రూరల్: మండలంలోని కాగజ్‌మద్దూర్‌లో బుధవారం సాయంత్రం ఎన్నికల ఫలితాలు వెలువడిన కొన్ని నిమిషాల్లోనే పై సల లొల్లి మొదలైంది. పంచాయతీ ఈసారి మహిళకు రిజర్వు కావడంతో మూడు పార్టీలకు చెందిన ముగ్గురు నాయకులు వారి భార్యలను బరిలో నిలిపారు. ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో ఓ మండల స్థాయి నాయకుడు విచ్చలవిడిగా మద్యం, డబ్బులు పంచినట్లు తెలిసింది. ఇంతటితో ఆగకుండా రెండు కుల సంఘాలకు 1.50 లక్షల చొప్పున ముట్ట జెప్పినట్లు తెలిసింది. మరికొన్ని కుల సంఘాలకు వ్యక్తిగతంగా వారి వారి కుటుంబంలో ఉన్న ఓట్ల సంఖ్యను బట్టి రూ. 500 నుంచి రూ. 10 వేల వరకు ఇచ్చారు. దీనికి తోడు మద్యం, బిర్యానీ పొట్లాలు సైతం పంపిణీ చేశారు. ఇంత చేసినా ఓటమి చెందటంతో ఆ నాయకుడు, అతడి వర్గీయులు కలిసి కుల సంఘాలను దుర్భాషలాడుతూ ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని పట్టుబట్టారు. దీంతో రెండు కుల సంఘాలకు చెందిన వారు తిరిగి డబ్బులు వాపస్ ఇచ్చినట్లు తెలిసింది. అలాగే ఓట్ల కోసం డబ్బులు తీసుకున్న మరికొంత మంది సైతం తిరిగి డబ్బులు వాపస్ ఇచ్చినట్లు సమాచారం.
అప్పుడు తల్లి, తండ్రి.. ప్రస్తుతం కొడుకు
నర్సాపూర్ రూరల్: మండలంలోని జక్కపల్లికి చెందిన దుప్తల భ రత్ బీటెక్ పూర్తి చేసి సర్పంచ్‌గా పోటీ చేసి గెలుపొందాడు. అయితే గత సర్పంచ్‌గా అతడి తల్లి వెంకటలక్ష్మి గెలుపొందింది. అంతకు ముందు తండ్రి శ్రీనివాస్ గ్రామ సర్పంచ్‌గా పని చేశాడు. వరుసగా మూడుసార్లు ఒ కే కుటుంబానికి సర్పంచ్ గిరి వరించింది.
అన్నపై.. తమ్ముడి గెలుపు
కౌడిపల్లి(నర్సాపూర్): మండలంలోని కూకుట్లపల్లిలో సర్పంచ్ పదవికి అన్నదమ్ములు పోటీపడ్డారు. కాంగ్రెస్ మద్దతుదారుగా అన్న నీరుడి అశోక్, బీఆర్‌ఎస్ తరపున తమ్ముడు కుమార్ పోటీ చేశారు. గెలుపు కోసం ముమ్మరంగా ప్రచారం చేశారు. చివరికి అన్నపై తమ్ముడు కుమార్ 197 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందాడు.
చిన్న కోడలును వరించిన పదవి
కౌడిపల్లి(నర్సాపూర్): సర్పంచ్ పదవికి తోటికోడళ్లు పోటీపడగా, చివరికి చిన్న కోడలును గెలుపు వరించింది. మండలంలోని పంచాయతీలో గత ఎన్నికల్లో ఏకగ్రీవ సర్పంచ్ జీవుల ఈసారి తన భార్య జమ్కి బీఆర్‌ఎస్ మద్దతుదారు గా పోటీ చేసింది. అతడి తమ్ముడు చెన్న భార్య లక్ష్మి కాంగ్రెస్ తరపున పోటీ చేశారు. దీంతో తండాలో తోటి కోడళ్ల పోరులో చివరికి చిన్న కోడలు లక్ష్మి గెలుపొందింది.
ఓటమి ఎరుగని కుటుంబం
నర్సాపూర్ రూరల్: మండలంలోని లింగాపూర్‌కు చెందిన బోర్లపు శ్రీనివాస్‌గుప్తా కుటుంబం 1988 నుంచి రిజర్వేషన్ కలిసి వచ్చిన ప్రతీసారి పోటీ చేసి గెలుపొందారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో శ్రీనివాస్‌గుప్తా భార్య రాజకళ సర్పంచ్‌గా గెలుపొందారు. గతంలో సైతం రాజకళ సర్పంచ్‌గా పనిచేశారు. శ్రీనివాస్‌గుప్తా రెండు పర్యాయాలు లింగాపూర్ సర్పంచ్‌గా, రెండుసార్లు లింగాపూర్ ఎంపీటీసీగా, 2006లో నర్సాపూర్ జెడ్పీటీసీగా గెలుపొందారు. అతని తండ్రి సైతం లింగాపూర్ సర్పంచ్‌గా పనిచేశారు. తండ్రి ఆశయ సాధనలో భాగంగా మొదటి నుంచి కాంగ్రెస్‌లోనే బోర్లపు కుటుంబం కొనసాగుతూ వస్తోంది.
మళ్లీ ఓట్ల లెక్కింపు చేపట్టాలి
మెదక్ కలెక్టరేట్/చిలప్‌చెడ్(నర్సాపూర్): కౌడిపల్లి మండలం తునికి సర్పంచ్ ఓట్ల లెక్కింపులో అక్రమాలు జరిగాయని, మళ్లీ ఓట్ల లెక్కింపు చేపట్టాలని సర్పంచ్ అభ్యర్థి స్వాతి డిమాండ్ చేశా రు. ఈ మేరకు గురువారం డీపీఓ కార్యాలయంలో ఫిర్యాదు అందజేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అధికారులు బీఆర్‌ఎస్‌కు వత్తా సు పలికారని ఆరోపించారు. ఓట్లను లెక్కించే సమయంలో ఫిజికల్‌గా తమకు చూపించలేదని ఆరోపించారు. ఫలితాల లెక్కింపులో అవకతవకలు జరిగాయని బండపోతుగల్ బీఆర్‌ఎస్ బలపరిచిన అభ్యర్ధి రామయ్యగారి రజిత తన మద్దతుదారులతో కలిసి ఎంపీడీఓ ప్రవీణ్‌కు వినతిపత్రం అందజేశారు. మొత్తం 786 ఓట్లు పోల్ కాగా, తనకు 386 ఓట్లు, ప్రత్యర్థికి 389 ఓట్లు వచ్చాయని తెలిపారు. మిగితా 11 బ్యాలెట్ పేపర్లు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఈ విషయమై అధికారులు ఎలాంటి సమాధానం చెప్పలేదన్నారు. ఫలితాలపై విచారణ చేయాలని కోరారు.
సర్పంచ్ పీఠంపై పట్టభద్రుడు
కొల్చారం(నర్సాపూర్): పోతంశెట్టిపల్లి సర్పంచ్‌గా బీజేపీ బలపరిచిన అభ్యర్థి పాతూరి దయాకర్‌గౌడ్ విజయం సాధించాడు. ఎంఏ, బీఈడీ పూర్తి చేసిన దయాకర్ పార్లమె ంట్ ఎన్నికలకు ముందు మండల పార్టీ అధ్యక్షుడిగా పనిచేశాడు. సమీప స్వతంత్ర అభ్యర్థిపై 256 ఓట్ల మెజార్టీతో గెలిచాడు.


