పల్లె ప్రగతిపై కోటి ఆశలు
● పాలకవర్గాలు లేక నిలిచిన నిధులు
● 22న కొత్త సర్పంచ్‌ల ప్రమాణస్వీకారం
రామాయంపేట(మెదక్): పంచాయతీలకు సుమారు రెండేళ్ల పాటు పాలకవర్గాలు లేక పాలన గాడి తప్పింది. ప్రత్యేకాధికారుల పాలనలో ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారు. అర్థిక సంఘం నిధులు రాక కార్యదర్శులు కొట్టుమిట్టాడారు. చెత్త సేకరణ ట్రాక్టర్లలో డీజిల్ పోయించడానికి సైతం డబ్బులు లేక చేతులెత్తేశారు. ఇక ఇలాంటి సమస్యలకు తెరపడనుంది. మరో నాలుగు రోజుల్లో పాలకవర్గాలు కొలువుదీరనున్నాయి. పల్లెల్లో సమస్యలు పరిష్కారానికి నోచుకోనున్నాయి.
గ్రామాల్లో ప్రధాన సమస్యలు
● జిల్లాలో 90కి పైగా జీపీలకు పక్కా భవనాలు లేవు. అద్దె ప్రాతిపదికన కొన్ని, పంచాయతీ కార్యాలయాల్లో మరికొన్ని కొనసాగుతున్నాయి.
● గ్రామాల్లో 350కి పైగా అంగన్‌వాడీ కేంద్రాలకు పక్కా భవనాలు లేకపోవడంతో అద్దె, పాఠశాల భవనాల్లో కొనసాగుతున్నాయి.
● కొన్ని పంచాయతీల్లో రేషన్ దుకాణాలు ప్రజలకు అందుబాటులో లేవు. దీంతో ప్రజలు కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వస్తోంది.
● గ్రామాల్లో చెత్త సేకరణ అస్తవ్యస్తంగా మారింది. చెత్త పేరుకపోయి దుర్వాసన వెదజల్లుతుంది.
● చిన్న పంచాయతీలు, గిరిజన తండాల్లో రహదారులు, మురుగు కాలువలు పాక్షికంగా శిథిలమై ప్రజలు ఇబ్బందులపాలవుతున్నారు.
● పశువులు నీరు తాగడానికి వీలుగా పశువుల తొట్లు నిర్మించకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు.
● గ్రామాలను ఆనుకొని ఉన్న చెరువులు ప్రమాదకరంగా మారాయి. జాగ్రత్త చర్యలు తీసుకోవాలి.
● ముఖ్యంగా తండాల్లో మురుగు నీరు రోడ్డుపై ప్రవహిస్తుండటంతో గిరిజనులు ఇబ్బందుల పాలవుతున్నారు.
● కొన్ని పంచాయతీల్లో బురుజులు పాక్షికంగా శిథిలమై ప్రమాదకరంగా మారాయి.
ప్రజల ఆశలు వమ్ము చేయను
ఎన్నో ఆశలతో గ్రామస్తులు గెలిపించారు. వారి ఆశలను వమ్ము చేయకుండా గ్రామాభివృద్ధికి కృషి చేస్తా. ముందుగా వార్డు సభ్యులతో కలిసి గ్రామంలో పర్యటించి సమస్యలను పరిశీలించి ఎమ్మెల్యే సహకారంతో పరిష్కరిస్తా.
– తార్యానాయక్,
సర్పంచ్, పర్వతాపూర్
మంచి పేరు తెచ్చుకోవాలి
కొత్తగా ఎన్నికై న సర్పంచ్‌లు నిస్వార్థంగా పనిచేసి గ్రామాల అభివృద్ధికి పాటుపడాలి. ఇందుకు ప్రజలు కూడా వారికి సహకరించాలి. ఎల్లవేళలా గ్రామస్తులకు అందుబాటులో ఉండాలి. ప్రధానంగా తాగు నీటి సరఫరా, పారిశుద్ధ్యం విషయమై దృష్టి సారించాలి.
– యాదయ్య,
జిల్లా పంచాయతీ అధికారి


