
తూకంలో చేతివాటం!
● తరుగు నష్టం రైతుకు... మిగులు ధాన్యం మిల్లర్లకా..? ● అన్నదాతకు అడుగడుగునా దగా
హవేళిఘణాపూర్(మెదక్): రైతే రాజు.. దేశానికి వెన్నెముక అని పాలకులు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారే తప్ప.. వారి శ్రేయస్సు కోసం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. ప్రభుత్వాలు ఎన్ని మారినా.. రైతు బతుకు మాత్రం మారడం లేదు. అడుగడుగునా రైతుకు దగాకు గురవుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. విత్తు నాటినప్పటి నుంచి కోత కోసి అమ్మేంత వరకు దగాకు గురవుతూనే ఉన్నాడు. అసలే వాతావరణం సహకరించకపోవడంతో అల్లాడిపోతున్న రైతన్నకు సరిగా ధాన్యం కొనుగోళ్లు జరగకపోవడం.. తూకాల్లో మోసం.. సకాలంలో డబ్బులు చెల్లించడం ఇలా అనేక సమస్యలతో సతమతమవుతున్నాడు. వరిధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద తూకం వేసిన రైతుల వద్ద నుంచి 40 కిలోల గోనెసంచులో పొల్లు ఉందనే సాకుతో రైతులు, రైస్‌మిల్లర్ల ఒప్పందంతో 42 కిలోల 200 గ్రాముల ధాన్యం తూకం చేస్తున్నా రు. అయినప్పటికీ లారీల్లో ధాన్యాన్ని రైస్ మిల్లర్లకు తరలించిన సమయంలో రైతుల సంచులకు మించి న బరువు ఎక్కువ వస్తే నోరు మెదపకుండా.. అదే తక్కువ వస్తే తరుగు పేరిట ధాన్యం, లేదా డబ్బు లు చెల్లించాలంటూ ఒత్తిడి చేస్తున్నారు. తరుగు నష్టం రైతుకు.. మిగులు ధాన్యం మిల్లర్లకా అని రైతులు ప్రశ్నిస్తున్నారు. రైస్‌మిల్లర్ల చేతివాటం కారణంగా వరిధాన్యం క్వింటాళ్ల కొద్ది నొక్కేస్తున్నారని పలువురు రైతులు వాపోతున్నారు.
అధికారుల పర్యవేక్షణ ఏదీ..?
లారీలు ఖాళీ చేసే సమయంలో అధికారులు పర్యవేక్షించి రైతుకు నష్టం జరుగకుండా చూడాలని కలెక్టర్ పదే పదే చెబుతున్నా.. అధికారులు ఈ విషయంలో మాత్రం చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఎవరైనా రైతులు ప్రశ్నిస్తే నిబంధనల పేరుతో ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తూకంలో తేడాలొస్తే సహించం
కలెక్టర్ రాహుల్‌రాజ్ హెచ్చరిక
మనోహరాబాద్(తూప్రాన్): రైతులు పండించిన ధాన్యం తూకంలో తేడాలు రావొద్దని, రైతులకు ఇబ్బందులు కాకుండా చూడాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ అధికారులకు సూచించారు. మంగళవారం మనోహరాబాద్ మండలం దండుపల్లి వద్ద పీఎసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ధాన్యంలో తేమ శాతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తూకంలో తేడాలు వస్తే సహించేది లేదని హెచ్చరించారు. ధాన్యంకు సరిపడా వాహనాలను, ఎగుమతులు, దిగుమతులు వెంటనే జరిగేలా చర్యలు చేపట్టాలన్నారు. అవసరమైతే హమాలీలను సమకూర్చుకోవాలన్నారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని, ప్రభుత్వం అందించే మద్దతు ధరకు విక్రయించుకోవాలని సూచించారు. కలెక్టర్ వెంట ఇన్‌చార్జి అడిషనల్ కలెక్టర్, డీఆర్వో భుజంగరావు, ఆర్డీఓ జయచంద్రారెడ్డి, డీటీ కౌషిక, తూప్రాన్ పీఎసీఎస్ చైర్మన్ బాలకృష్ణారెడ్డి పాల్గొన్నారు.