
15 రోజులపాటు వేసవి శిబిరాలు
చేగుంట(తూప్రాన్)/రామాయంపేట(మెదక్): విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీయడానికి వేసవి శిబిరాలు ఎంతో దోహదపడుతాయని జిల్లా విద్యాధికారి రాధా కిషన్ తెలిపారు. చేగుంట ఉన్నత పాఠశాలలో, అలాగే.. రామాయంపేట ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన వేసవి శిబిరాలను మంగళవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ.. జిల్లాలో మండలానికి ఒక పాఠశాలలో వేసవి శిబిరం ఏర్పాటు చేసినట్లు, యోగా, చిత్రలేఖనం, కుట్టు అల్లికలు, పాటలు పాడటం తదితర అంశాలపై 6 నుంచి 9వ తరగతి విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నట్లు ఆయన వివరించారు. జిల్లా పరిధిలోని అన్ని క్యాంపుల్లో వంద మంది వరకు పిల్లలను చేర్చుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. 15రోజుల పాటు నిర్వహించే వేసవి శిబిరాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు. చేగుంటలో జరిగిన కార్యక్రమంలో తపస్ ఉపాధ్యాయ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్, సంఘం నాయకులు వెంకటేశ్, స్వామి, నందూ, సుమతి, రేఖ, మంజులత, సంధ్య, అలాగే.. రామాయంపేటలో ఎంఈవో శ్రీనివాస్, స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు నాగమణి, యోగా మాస్టర్ మద్దెల భవర్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లా విద్యాధికారి రాధాకిషన్
చేగుంట, రామాయంపేటలో
వేసవి శిబిరాల సందర్శన