
ధాన్యం తరలింపులో నిర్లక్ష్యం వద్దు
కలెక్టర్ రాహుల్‌రాజ్
హవేళిఘణాపూర్(మెదక్): ధాన్యం తరలింపులో నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దని, సమన్వయంతో పని చేసి వీలైనంత త్వరగా తూకం వేసి తరలించేలా చూడాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ అధికారులను ఆదేశించారు. ఆదివారం మండలంలోని కూచన్‌పల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. కేంద్రంలో కొనుగోలు వివరాలు, ధాన్యం తరలింపు గురించి నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. రైతులు, ఇతర సౌకర్యాలపై ఆరా తీశారు. కొనుగోలు కేంద్రాల్లో సేకరించిన ధాన్యం తడవకుండా టార్పాలిన్లు కప్పాలని నిర్వాహకులకు సూచించారు. లారీల కొరత లేకుండా చూసుకోవాలన్నారు. రైతులు తమ పంటలను సులభంగా విక్రయించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను రైతులు ఉపయోగించుకోవాలన్నారు. రైస్ మిల్లర్లు ధాన్యాన్ని త్వరగా దించుకోవాలని, ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టర్ వెంట కొనుగోలు కేంద్రం నిర్వాహకులు తదితరులు ఉన్నారు.
భగీరథ మహర్షిని ఆదర్శంగా తీసుకోవాలి
మెదక్ కలెక్టరేట్: దివి నుంచి భువికి గంగను తీసుకొచ్చిన మహర్షి భగీరథుడని కలెక్టర్ రాహుల్‌రాజ్ అన్నారు. ఆదివారం బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లో భగీరథ మహర్షి జయంతిని నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. భగీరథుడి దీక్ష, సహనం, పట్టుదల ఆదర్శంగా తీసుకుని మనం మన లక్ష్యాలను సాధిద్దామని పిలుపునిచ్చారు. అనంతరం మెదక్ పట్టణంలోని గాంధీనగర్ వీధిలో గల బస్తీ దవాఖానాను ఆకస్మికంగా సందర్శించారు. ఈసందర్భంగా ఆస్పత్రిలో రికార్డులు, మందులను పరిశీలించారు. మెరుగైన సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో బీసీ సంఘం గౌరవ అధ్యక్షుడు మెట్టు గంగారం, నాయకులు నగేష్, జిల్లా కార్యదర్శి నగేష్ తదితరులు పాల్గొన్నారు.