వలస కార్మికులపై పోలీసుల నిఘా..! | - | Sakshi
Sakshi News home page

వలస కార్మికులపై పోలీసుల నిఘా..!

May 19 2026 12:16 AM | Updated on May 19 2026 12:16 AM

ఇతర రాష్ట్రాలకు చెందిన, గుర్తు తెలియని వ్యక్తులను పనిలో పెట్టుకునే ముందు వారిని పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చి నేరచరిత్ర తనిఖీ చేయించాలి.

ఇళ్లు అద్దెకు ఇచ్చే ముందు ఆధార్‌కార్డు, ఫోన్‌నంబర్‌ తీసుకోవాలి. ఎలాంటి ఆధారాలు లేకుండా ఇళ్లు అద్దెకు ఇవ్వరాదు. పోలీసులకు సమాచారం అందించాలి.

అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలి. లేదా 100కు డయల్‌ చేసి సమాచారం అందించాలి.

హైదరాబాద్‌ ఘటనతో అప్రమత్తం

జిల్లాలో వలస కార్మికుల వివరాలు సేకరిస్తున్న పోలీసులు

పోలీసుల క్లియరెన్స్‌ ఉంటేనే పనిలో పెట్టుకోవాలని సీపీ ఆదేశాలు

మంచిర్యాలక్రైం: అంతర్రాష్ట్ర వలసదారుల సంఖ్య జిల్లాలో రోజురోజుకూ పెరుగుతోంది. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన చోరీలు, వివిధ నేరాలకు పాల్పడిన వారిలో అధిక శాతం ఇంటర్‌ స్టేట్‌కు చెందినవారే ఉండడం గమనార్హం. గతంలో మంచి ర్యాల కాలేజిరోడ్‌లో పానిపూరి వ్యాపారం చేస్తున్న రాజస్థాన్‌కు చెందిన రవి, ప్రసాద్‌ బిహార్‌ నుంచి తెప్పించిన రెండు నాటు తుపాకులు విక్రయిస్తుండగా పోలీసులు పట్టుకున్న ఘటన సంచలనం సృష్టించింది. ఈ నెల 15న జిల్లా కేంద్రంలోని హమాలివాడలో కార్డెన్‌సెర్చ్‌ నిర్వహించగా ఇతర రాష్ట్రాలకు చెందిన 55 మందిని గుర్తించారు. వీరంతా హోటళ్లు, దుకాణాలు, దినసరి కూలీలుగా పనిచేసుకుంటూ జీవనం సాగించేవారే కావడం గమనార్హం. ఇటీవల హైదరాబాద్‌లో ఓ రిటైర్డ్‌ ఐపీఎస్‌ పోలీస్‌ అధికారి భార్య హత్య కేసులో ఇంట్లో పనిమనిషిగా చేరిన నేపాల్‌ మహిళనే ప్రధాన నిందితురాలు కావడం, కరీంనగర్‌లోని జువెల్లరీ షాపులో పట్టపగలే చోరీకి పాల్పడినవారు ఇతర రాష్ట్రాలకు చెందినవారే కావడంతో ఇటీవల డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన సీవీ ఆనంద్‌ ఇంటర్‌ స్టేట్‌ వలస కార్మికులపై పూర్తిస్థాయి నిఘా పెంచాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో రామగుండం పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝా ఆదేశాల మేరకు జిల్లా పోలీస్‌ యంత్రాంగం ఇంటర్‌ స్టేట్‌ వలస కార్మికుల వివరాల సేకరణలో నిమగ్నమయ్యారు.

అధునాతన సాంకేతికతతో..

నేరాల నియంత్రణే లక్ష్యంగా పోలీసులు అధునా త న సాంకేతికతతో ప్రత్యేక నిఘా పెంచారు. హోట ళ్లు, వివిధ వ్యాపార సంస్థలు, సింగరేణి ఓపెన్‌కాస్ట్‌లో కాంట్రాక్టు కార్మికులు, ఎస్టీపీపీ, భవన నిర్మాణ రంగం, వీధి వ్యాపార సంస్థల్లో పనిచేస్తున్న ఇతర రాష్ట్రాల కార్మికుల వివరాలు సేకరిస్తున్నారు. ఫింగర్‌ ప్రింట్‌, ఆధార్‌కార్డు, తదితర వివరాలు సేకరించి ఆన్‌లైన్‌లో పొందుపరుస్తున్నారు. దీనివల్ల గతంలో ఎవరికై నా నేర చరిత్ర ఉంటే ఇట్టే బయటపడుతుంది. భవిష్యత్‌లో ఎక్కడైనా నేరాలకు పాల్పడితే వేలిముద్రల ఆధారంగా క్షణాల్లో గుర్తించవచ్చు.

జిల్లాలో వేలాది మంది..

రోజురోజుకు మంచిర్యాల పారిశ్రామిక, రియల్‌ ఎస్టేట్‌ రంగాల్లో అభివృద్ధి చెందుతోంది. సింగరేణి మైన్స్‌, ఎస్టీపీపీ, రైస్‌మిల్లులు, ఇటుకబట్టీలు, గృహ నిర్మాణ రంగాలు, వ్యవసాయ పనులతో పాటు ఇతర రంగాల్లో ఇతర రాష్ట్రాలకు చెందిన వారు వేలసంఖ్యలో వలస కార్మికులు పనిచేస్తున్నారు. మంచిర్యాల, చెన్నూర్‌, లక్సెట్టిపేట, బెల్లంపల్లితో పాటు గ్రామీణ ప్రాంతాల్లో సైతం వివిధ పనులు చేసుకుంటూ స్థిరపడ్డారు. ఇందులో కొందరు జల్సాలకు అలవాటుపడి ఈజీగా మనీ సంపాదించాలన్న ఆలోచనతో నేరాలకు పాల్పడుతున్నారు. స్వగ్రామాల్లో నేరాలు చేసి ఇక్కడ తలదాచుకునేందుకు వచ్చి ఇక్కడకూడా మళ్లీ అదే నేరాలకు పాల్పడుతూ రైలుమార్గంలో తప్పించుకుంటున్నారు. జిల్లా కేంద్రంలోని గౌతమేశ్వర కాలనీలో గత నెల 24న చోరీకి పాల్పడిన చంద్రపూర్‌కు చెందిన అశీష్‌ శ్రీనివాస్‌, రెడ్డిమల్ల ఆకాష్‌పై చంద్రపూర్‌, నాగ్‌పూర్‌లో 12కు పైగా కేసులున్నాయి.

ప్రజలకు పోలీసుల సూచనలు

Advertisement
 
Advertisement
Advertisement