ఈ నెల 22 వరకు 44 డిగ్రీలపైనే ఉష్ణోగ్రతలు
హెచ్చరించిన భారత వాతావరణ శాఖ
అప్రమత్తంగా ఉండాలంటున్న వైద్యాధికారులు
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: మండుటెండలతో జనం బేజారవుతున్నారు. రాబోయే నాలుగు రోజులు ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని, అందరూ అప్రమత్తంగా ఉండాలంటూ భారత వాతావరణ శాఖ ప్రత్యేక బులిటెన్ విడుదల చేసింది. జిల్లా వైద్యాశాఖ సైతం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది. అయితే పంటలు అమ్ముకోవడం కోసం జిల్లాలో రైతన్నలకు గోస తప్పడం లేదు. ఒకవైపు రోజురోజుకూ ఎండలు ముదిరి వేడి గాలుల తీవ్రత పెరుగుతోంది. వారం రోజులుగా వడ్లు కేంద్రాలకు పోటెత్తుతున్నాయి. అయితే సకాలంలో ధాన్యం తూకం కావడం లేదు. కాంటా వేశాక కూడా రవాణాలో జాప్యం జరుగుతోంది. లారీల్లోనూ ధాన్యం అన్‌లోడ్ కావడం లేదు. దీంతో రోజుల తరబడి ఎదురుచూడాల్సి వస్తోంది.
అలసిపోతున్న హమాలీలు
ధాన్యం తూకం నుంచి లారీల్లో లోడింగ్, అన్‌లోడింగ్ దాక హమాలీలే కీలకం. ఎండ వేడిమికి గోదాముల్లో లారీలు అన్‌లోడ్ కాక తీవ్ర జాప్యం జరుగుతోంది. ఇప్పటికే పలు చోట్ల ఎండ వేడికి అస్వస్థతకు గురవుతున్నారు. దీంతో ఉదయం పది గంటల వరకు సాయంత్రం మళ్ళీ ఆరు తర్వాత మొదలు పెట్టి అర్థరాత్రి వరకు పని చేస్తున్నారు.
జాగ్రత్తలు తప్పనిసరి
వేసవిలో ఎండ ముప్పు నుంచి తప్పించుకోవాలంటే ఎండకు బయట తిరగకపోవడమే ఉత్తమమని జిల్లా వైద్యాధికారులు సూచిస్తున్నారు. వీలైనంత వరకు ఉదయం, సాయంత్రం పూటనే పనులు పూర్తి చేసుకోవాలని కోరుతున్నారు. ఎప్పటికప్పుడు శరీ రానికి కావాల్సిన ద్రవాలు తీసుకుంటూ ఒంట్లో నీరు తగ్గి, డీ హైడ్రేట్ కాకుండా చూసుకోవాలంటున్నారు. ఎవరైనా వడదెబ్బకు గురైతే వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించాలని కోరుతున్నారు. వాంతులు, విరోచనాలు, నీరసం ఏర్పడితే సొంత వైద్యం చేసుకోవద్దని కోరుతున్నారు. చిన్నారులు, వృద్ధులు, గర్భిణులు వేసవిలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు.
గడిచిన నెల వ్యవధిలో జిల్లాలో నలుగురు వడదెబ్బ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. నెన్నెల మండలం గుండ్ల సోమారం గ్రామానికి చెందిన చల్లూరి రుక్మ (55), బెల్లంపల్లి పట్టణంలోని షంషీర్ నగర్ బస్తీకి చెందిన నారా సంపత్, తాండూరు మండలం బారేపల్లికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ కోట్రంగి జయరాం (40), మందమర్రిలోని పాత బస్టాండ్‌కు చెందిన బండారి రాజేశ్‌గౌడ్ వడదెబ్బతో చనిపోయారు.


