భీమారం: కొనుగోలు కేంద్రాల్లో నిబంధనల ప్రకారం రైతుల వద్ద నుంచి నాణ్యమైన ధాన్యం కొనుగోలు చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం భీమారం మండలంలోని పోలంపల్లి, భీమారంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. స్వయంగా వరిధాన్యం నాణ్యతను పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ కేంద్రాలలో రైతులకు తాగునీరు, నీడ సదుపాయం కల్పించడంతో పాటు గోనె సంచులు అందుబాటులో ఉంచాలని నిర్వాహకులకు సూచించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని కేటాయించిన ప్రకారంగా రైస్ మిల్లులకు తరలించాలన్నారు. అంకూసాపూర్, నస్పూర్ మండల కేంద్రాల్లో గల రైస్‌మిల్లులను జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి బ్రహ్మారావు, జిల్లా మేనేజర్ శ్రీకళతో కలిసి సందర్శించి ధాన్యం దిగుమతి ప్రక్రియ పరిశీలించారు. రోజుకు కనీసం 10 నుంచి 15 లారీల ధాన్యాన్ని దిగుమతి చేసుకోవాలన్నారు.
ఆరోగ్యకరమైన జీవితం
పెంపొందించుకోవాలి
మంచిర్యాలటౌన్: ఆరోగ్యకరమైన జీవితం కోసం ప్రతిఒక్కరూ దైనందిన జీవితంలో యోగా, వ్యాయామం భాగం చేసుకోవాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా జిల్లా యువజన క్రీడా శాఖ ఆధ్వర్యంలో సోమవారం తెలంగాణ మారథాన్ ఫిజికల్ లిటరసీ కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ మాదకద్రవ్య రహిత తెలంగాణకు సమష్టి కృషి చేయాలని పిలుపునిచ్చారు. నో టు డ్రగ్స్ ఎస్ టు ఎక్సర్‌సైజ్ నినాదం దిశగా ప్రతి ఒక్కరు ఆరోగ్యం వైపు అడుగులు వేయాలన్నారు.
సీఎంఆర్ ప్రక్రియ ప్రారంభించాలి
మంచిర్యాలఅగ్రికల్చర్: రైస్ మిల్లర్లు ధాన్యం సీఎంఆర్ ప్రక్రియ వెంటనే ప్రారంభించాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి బ్రహ్మారావు, జిల్లా మేనేజర్ శ్రీకళ, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి కిషన్‌తో కలిసి రైస్ మిల్లర్లతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ధాన్యం దిగుమతిలో ఆలస్యం లేకుండా పర్యవేక్షించాలన్నారు.


