చెట్టు ముడితే.. పట్టేస్తది | - | Sakshi
Sakshi News home page

చెట్టు ముడితే.. పట్టేస్తది

May 19 2026 12:10 AM | Updated on May 19 2026 12:10 AM

● కవ్వాల్‌ అడవిలో హంటర్‌.. టెర్రర్‌ ● 9 నెలల్లో 14 కేసులు ఛేదించిన డాగ్‌

జన్నారం: కుక్క విశ్వాసవంతమైన జంతువు. మనతో కలిసి జీవించే శునకాలు కొన్ని విషయాల్లో మనకన్నా తెలివైనవి. యజమానులకు హాని తలపెట్టేవారి తాట తీస్తాయి. ఇక పోలీసులు, ఆర్మీకి దొంగలు, ఉగ్రవాదులను పట్టుకోవడంలో సహాయపడతాయి. తాజాగా అటవీశాఖలోనూ కలప స్మగ్లర్ల భరతం పడుతున్నాయి. కలప తరలించుకుపోయే, వన్యప్రాణులను వేటాడేవారిని ఇట్టే పట్టేస్తున్నాయి. జన్నారం అటవీ డివిజన్‌కు కేటాయించిన డాగ్‌ స్క్వాడ్‌ గడిచిన 9 నెలల్లో 14 కేసులను ఛేదించింది.

ఏడు నెలల శిక్షణ..

ఈ డాగ్‌ల సంరక్షణ, నిర్వహణ కోసం బీట్‌ అధికారి అనిల్‌కుమార్‌కు ఏడు నెలల ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. హర్యానాలోని ఇండో టిబెటన్‌ బార్డర్‌ పోలీస్‌ శిక్షణ కేంద్రంలో ఈ శిక్షణను పూర్తి చేసి, డాగ్‌ స్క్వాడ్‌తో కలిసి జన్నారం డివిజన్‌కు చేరుకున్నారు. ఈ డాగ్‌ స్క్వాడ్‌కు ‘హంటర్‌’ అని పేరు పెట్టారు. 2025 ఆగస్టులో హంటర్‌ను జన్నారం డివిజన్‌కు తీసుకొచ్చారు. డివిజన్‌ కేంద్రంలో బీట్‌ అధికారి అనిల్‌కుమార్‌తోపాటు బేస్‌ క్యాంపు సిబ్బంది హంటర్‌ ఆరోగ్యం, ఆహారం, డైట్‌ ప్లాన్‌, వ్యాయామం, నియమిత వైద్య పరీక్షలు చేయిస్తూ సక్రమంగా చూసుకుంటున్నారు.

గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు..

కవ్వాల్‌ టైగర్‌ జోన్‌ పరిధిలోని గ్రామాల్లో అటవీశాఖ అధికారులు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రేంజ్‌ సిబ్బందితోపాటు హంటర్‌ డాగ్‌ స్క్వాడ్‌ను గ్రామాలకు తీసుకెళ్లి ప్రత్యక్ష ప్రదర్శనలు ఇస్తున్నారు. ‘మనుషులు అబద్ధం చెప్పవచ్చు, కానీ డాగ్‌ అబద్ధం చెప్పదు’ అని స్పష్టంగా తెలియజేస్తున్నారు. డాగ్‌ స్క్వాడ్‌ వచ్చిన తర్వాత జన్నారం డివిజన్‌లో అటవీ నేరాలు గణనీయంగా తగ్గినట్లు అధికారులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement