లఘు చిత్రాలకు.. ‘లక్ష’ణంగా ఆహ్వానం | - | Sakshi
Sakshi News home page

లఘు చిత్రాలకు.. ‘లక్ష’ణంగా ఆహ్వానం

May 19 2026 12:10 AM | Updated on May 19 2026 12:10 AM

షార్ట్‌ఫిల్మ్‌ పోటీలకు ఎన్‌హెచ్‌ఆర్‌సీ శ్రీకారం భారీగా నగదు బహుమతులు ఔత్సాహికులకు సువర్ణావకాశం

ఆదిలాబాద్‌: ప్రస్తుత సమాజంపై సోషల్‌ మీడియా ఎంతగానో ప్రభావం చూపుతోంది. సామాజిక పరిస్థితులపై ప్రత్యక్షంగా, పరోక్షంగా తమదైన ముద్ర వేస్తోంది. ఈ నేపథ్యంలో మానవ హక్కులపై మరింతగా అవగాహన కల్పించాలనే ధ్యేయంతో జాతీయ మానవహక్కుల కమిషన్‌ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) షార్ట్‌ ఫిల్మ్‌స్‌ పోటీలకు శ్రీకారం చుట్టింది. సందేశాత్మకంగా లఘు చిత్రాల రూపకల్పనకు అవకాశం ఇచ్చింది.

ఈ అంశాలపై..

దేశవ్యాప్తంగా పౌర హక్కులపై అవగాహన పెంపొందించే ఉద్దేశంతో సృజనాత్మక లఘు చిత్రాల పోటీలకు ఎన్‌హెచ్‌ఆర్‌సీ శ్రీకారం చుట్టింది. సమాజంలోని వివిధ మానవ హక్కుల ఉల్లంఘనలను దృశ్యరూపంలో ఆవిష్కరించేందుకు ఈ వేదిక ద్వారా అవకాశం కల్పిస్తోంది. పోటీల్లో భాగంగా సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాలతో పాటు ప్రాథమిక హక్కులపై లఘు చిత్రాలను రూపొందించాలి. డాక్యుమెంటరీ, యానిమేషన్‌ లేదా కల్పిత కథల రూపంలో జీవించే హక్కు, సమానత్వం, గౌరవం వంటి అంశాలను ప్రతిబింబించాలి. ముఖ్యంగా బాల కార్మిక వ్యవస్థ, వెట్టిచాకిరీ, మహిళలు, చిన్నారులు, వృద్ధులు, దివ్యాంగుల హక్కులతో పాటు మానవ అక్రమ రవాణా, గృహ హింస, పోలీసు అకృత్యాలు, జైలు సంస్కరణల వంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. వీటితో పాటు విద్యా హక్కు, ఉపాధి, ఆరోగ్య సంరక్షణ, స్వచ్ఛమైన పర్యావరణం, ఆహార భద్రత, ట్రాన్స్‌ జెండర్ల హక్కులపై కూడా దృష్టి సారించవచ్చు. భారతీయ వైవిధ్యంలోని మానవ విలువలు, అభివృద్ధి కార్యక్రమాలను దృశ్యరూపంలో ఆవిష్కరించవచ్చు.

నిబంధనలివే..

ఈ పోటీల్లో వయసుతో సంబంధం లేకుండా ఎవరైనా పాల్గొనవచ్చు. మానవ హక్కుల అంశాలపై 3 నుంచి 10 నిమిషాల నిడివి గల చిత్రాలను పంపేందుకు అవకాశం ఉంది. అభ్యర్థులు ఎన్ని ఎంట్రీలనైనా పంపే అవకాశం ఉన్నప్పటికీ, గతంలో కమిషన్‌కు పంపినవి, సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేసిన వాటిని పరిగణలోనికి తీసుకోరు. వీటిని ఎంపీ4 ఫార్మాట్‌లో ఫుల్‌ హెచ్‌డీ నాణ్యతతో, వీలైతే 2 జీబీలోపు సైజులో ఉండేలా చూసుకోవాలి. ఏ భారతీయ భాషలో తీసినప్పటికీ, తప్పనిసరిగా ఇంగ్లిష్‌ సబ్‌టైటిల్స్‌ జత చేయాల్సి ఉంటుంది. దరఖాస్తుతో పాటు చిత్రం ఇతివృత్తం, ప్రభుత్వం జారీ చేసిన ఐడెంటిటీ ప్రూఫ్‌ (ఆధార్‌, ఓటర్‌ ఐడీ, పాన్‌కార్డ్‌ వంటివి) జతచేయాలని కమిషన్‌ సూచించింది.

భారీగా నజరానా

మానవ హక్కుల పరిరక్షణ, సామాజిక న్యాయం వంటి ఇతివృత్తాలతో రూపొందించిన ఉత్తమ లఘు చిత్రాలకు కమిషన్‌ భారీ నగదు బహుమతులను ప్రకటించింది. ప్రథమ విజేతకు రూ.2 లక్షలు, ద్వితీయ విజేతకు రూ.1.50 లక్షలు, తృతీయ విజేతకు రూ.లక్ష చొప్పున నగదు పురస్కారాలు లభించనున్నాయి. కేవలం నగదు మాత్రమే కాకుండా, ఎంపికై న చిత్రాలను జాతీయస్థాయి వేదికలపై ప్రదర్శించే అవకాశం కూడా ఉంటుంది. ఔత్సాహికులు సమాజానికి మేలు చేసే సందేశాత్మక చిత్రాలతో భాగస్వాములు కావాలని కమిషన్‌ కోరుతోంది.

ఇలా పంపాలి..

ఆసక్తి ఉన్న వారు తమ లఘు చిత్రంను, దరఖాస్తును, కథాంశాన్ని గూగుల్‌ డ్రైవ్‌లో అప్‌ లోడ్‌ చేసి ఆ ఫోల్డర్‌కు Short Film Awar d-2026, తమ పేరు నమోదు చేయాలి. ఆతర్వాత ఆ డ్రైవ్‌ లింక్‌ను nhrcshortfilm @gmail.com ఈమెయిల్‌కు పంపాలి. ఇందులో పోటీదారుని పూర్తి చిరునామా, ఫోన్‌ నంబర్‌ పొందుపరచాలి. ఆన్‌లైన్‌ ద్వారా పంపిన వాటినే కమిషన్‌ ఆమోదిస్తుంది. డీవీడీలు, పెన్‌ డ్రైవ్‌లు పంపకూడదు. దరఖాస్తుకు చివరి తేదీ జూన్‌ 30.

Advertisement
 
Advertisement
Advertisement