జైపూర్: భీమారం పోలీస్‌స్టేషన్ పరిధిలో 316 కేజీల నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం చేసుకున్నట్లు మంచిర్యాల డీసీపీ భాస్కర్ తెలిపారు. జైపూర్ అసిస్టెంట్ కమిషనరేట్‌లో సోమవారం ఏసీపీ వెంకటేశ్వర్‌తో కలిసి వివరాలు వెల్లడించారు. ఎస్సై రాజేందర్, మండల వ్యవసాయశాఖ అధికారి సుధాకర్, సిబ్బందితో కలిసి సోమవారం భీమారంలోని ఇప్పలబోడలో పెనుకుల రవి ఇంట్లో తనిఖీలు నిర్వహించగా ఏడు సంచుల్లో నకిలీ పత్తి విత్తనాలు గుర్తించినట్లు తెలిపారు. ఇటీవల 150 కిలోల విత్తనాలను ఆటోలో తెప్పించగా రూ.80 వేల అడ్వాన్స్ చెల్లించి ట్రాన్స్‌పోర్టు ద్వారా 200 కిలోల విత్తనాలు తెప్పించినట్లు విచారణలో అంగీకరించాడు. విత్తనాల వి లువ రూ.9.48 లక్షలు ఉంటుందని, ఇదే కేసులో మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. నిందితుడు రవిని అరెస్టు చేసి కోర్టులో హా జరుపర్చనున్నట్లు తెలిపారు. భీమారం ఎస్సై రా జేందర్‌తో పాటు పోలీస్ సిబ్బందిని సీపీ అంబర్ కిశోర్‌ఝా, డీసీపీ భాస్కర్, ఏసీపీ వెంకటేశ్వర్ అభినందించారు. సమావేశంలో సీఐలు నవీన్‌కుమార్, బన్సీలాల్, ఎస్సై భూమేశ్ పాల్గొన్నారు.
చెన్నూర్: చెన్నూర్‌లో 70 కిలోల నకిలీ పత్తి విత్తనాలు పట్టుకుని ముగ్గుర్ని అరెస్టు చేసినట్లు మంచిర్యాల డీసీపి భాస్కర్ తెలిపారు. జైపూర్‌లోని ఏసీపీ కార్యాలయంలో సోమవారం వివరాలు వెల్ల డించారు. భీమిని మండలం మల్లిడికి చెందిన ఇందూరి పెంటయ్య మందమర్రికి చెందిన పిండి సురేష్ వద్ద 40 కిలోల నకిలీ పత్తి విత్తనాలు కొనుగోలు చేశాడు. చెన్నూర్, సిరోంచ ప్రాంతాల్లో అమ్మేందు కు చెన్నూర్‌కు వచ్చి సుబ్బరాంపల్లికి చెందిన సాయిని రమేష్‌కు సమాచారం అందించాడు. రమేష్ తన వద్ద ఉన్న 20 కిలోల విత్తనాలను తీసుకొని వచ్చాడు. ఇద్దరూ కలిసి సిరోంచకు వెళ్లేందుకు చెన్నూర్ బస్‌స్టాండ్‌లో వేచి ఉండగా పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు వారిని పట్టుకొని చెన్నూర్ ఏవోకు సమాచారం ఇచ్చారు. ఇద్దరి వద్ద నుంచి 60 కిలోల విత్తనాలను సీజ్ చేసి సాయిని రమేష్ స్టేట్‌మెంట్ ఆధారంగా చెన్నూర్‌లోని వెన్నపు రెడ్డి మల్లారెడ్డి ఇంటికి వెళ్లి అతని వద్ద నుంచి 10 కిలోల విత్తనాలు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిని అదుపులోకి తీసుకొని చెన్నూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. వెన్నపురెడ్డి మల్లారెడ్డి రాజబాపు అనే అతని దగ్గర నకిలీ పత్తి విత్తనాలు కొనుగోలు చేశారన్నారు. ఇందులో పిండి సురేష్, రాజబాపు పరారీలో ఉన్నట్లు తెలిపారు.


