ఆదిలాబాద్‌టౌన్: నేరాల నియంత్రణ, ప్రజల భద్రత కోసమే కమ్యూనిటీ కాంటాక్ట్ నిర్వహిస్తున్నామని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని వడ్డెర కాలనీలో ఉదయం 5 నుంచి 8 గంటల వరకు వంద మంది సిబ్బందితో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. సరైన పత్రాలు లేని 67 ద్విచక్ర వాహనాలు, 16 ఆటోలు, రెండు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపా రు. అలాగే 98 దేశీదారు, 12 లిక్కర్ బాటిళ్లను సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. ముగ్గురుపై కేసులు నమోదు చేసినట్లు వివరించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ రహదారి నిబంధనలు పాటించాలన్నారు. అలాగే యువత గంజాయి, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని అన్నారు. ఇదివరకే కేసులు నమోదైన వారిపై సస్పెక్ట్ షీట్లు ఓపెన్ చేస్తామని, అయినా మారకుంటే పీడీ యాక్ట్ నమోదు చేస్తామని హెచ్చరించారు. నంబర్ ప్లేట్, లైసెన్సు లేకుండా వాహనాలు నడపడం చట్టరీత్యా నేరమని అన్నారు. కార్యక్రమంలో డీఎస్పీలు ఎల్.జీవన్‌రెడ్డి, ఏఆర్ డీఎస్పీ కమతం ఇంద్రవర్ధన్, పట్టణ సీఐలు సునీల్ కుమార్, నాగరాజు, ప్రణయ్ కుమార్, ఫణిధర్, స్వామి, బిడి ప్రేమ్ కుమార్, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్లు వెంకటి, టి.మురళి, ఎన్.చంద్రశేఖర్, ఎస్సైలు రాధిక, విష్ణువర్ధన్, ఎస్సైలు దేవేందర్, విష్ణుప్రకాష్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


