పాతమంచిర్యాల: సామాజిక భద్రత పింఛన్ల పంపిణీ పక్రియను పకడ్బందీగా అమలు చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పింఛన్ల పంపిణీలో పలు అక్రమాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో వాటికి అడ్డుకట్ట వేయడానికి సర్వే చేపడుతోంది. జిల్లా గ్రామీణాభివృద్ధి, మున్సిపల్, రెవెన్యూ శాఖల అధికారులు ఈ నెల 15నుంచి జూన్ 15వరకు మున్సిపాల్టీలు, గ్రామాల్లో సర్వే నిర్వహించనున్నారు. బ్యాంకుల ద్వారా పింఛన్లు పొందుతున్న వారి వివరాల సేకరణకు లైవ్‌నెస్ అథెంటికేషన్ యాప్‌ను ఉపయోగించి వారు బతికి ఉన్నట్లయితే పింఛన్ కొనసాగిస్తారు. లేనిపక్షంలో లబ్ధిదారుల జాబితా నుంచి పేర్లను తొలగిస్తారు. జిల్లాలో ప్రతీ నెల చేయూత పథకం ద్వారా 92,958 మందికి సామాజిక భద్రత పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. వీటిలో పోస్టాఫీసుల ద్వారా 70,285, బ్యాంకుల ద్వారా 22,673 అందిస్తుండగా.. 10 నుంచి 20 పింఛన్లు మండలాల్లోని గ్రామాల్లో అందజేస్తున్నారు. పింఛన్ల పంపిణీలో అక్రమాలు జరగకుండా పోస్టాఫీసుల ద్వారా జరిగే పంపిణీలో ఫేస్ రికగ్నిషన్ సాఫ్ట్‌వేర్(ఎఫ్‌ఆర్‌ఎస్), బయోమెట్రిక్ ఫింగర్‌ప్రింట్‌తో ఇస్తున్నారు. కానీ బ్యాంకుల్లో పింఛన్లు తీసుకున్న వారికి ప్రతీ నెల ఎలాంటి సాంకేతికత ఉపయోగించకుండానే నేరుగా ఖాతాల్లో జమ చేస్తున్నారు. ఈ క్రమంలో పింఛన్లు అసలు లబ్ధిదారులు తీసుకుంటున్నారా లేక వారికి సంబంధించిన ఎవరైనా తీసుకుంటున్నారా అనే విషయాన్ని అధికారులు కనిపెట్టలేకపోతున్నారు. దీంతో చనిపోయిన వారి పేరున పింఛన్ సొమ్ము ఖాతాల్లో జమ అవుతూ వస్తోంది. బతికి ఉన్న వారు పింఛన్లు తీసుకుంటుండగా.. చనిపోయిన వారి పింఛన్ సొమ్ము ఖాతాల్లోనే ఉండిపోతోంది. లబ్ధిదారులు బతికి ఉన్నారా చనిపోయారా అనే వివరాలు అధికారులకు అందడం లేదు. దీంతో చాలాచోట్ల పింఛన్ లబ్ధిదారులు చనిపోయి సంవత్సరాలు, నెలలు గడుస్తున్నా పింఛన్ సొమ్ము వారి ఖాతాల్లోనే జమ అవుతోంది. కొత్తగా పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి పింఛన్లు మంజూరు కావడం లేదు. జిల్లాలోని మంచిర్యాల, మందమర్రి, బెల్లంపల్లి, పాత మున్సిపాల్టీల పరిధిలో 22,673 మంది పింఛన్ లబ్ధిదారులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీరిలో ఎంతమంది జీవించి ఉన్నారు, ఎంతమంది మరణించారనే విషయాన్ని ధ్రువీకరించడానికి అధికారులు సమాయత్తం అవుతున్నారు. అర్హులైన లబ్ధిదారులను గుర్తించడానికి ప్రత్యేక యాప్‌ను ఉపయోగించి మున్సిపల్ వార్డు అధికారులు, బిల్ కలెక్టర్లు బెల్లంపల్లిలోని 28వార్డులు, మందమర్రిలోని 24 వార్డులు, మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని 60 డివిజన్లలో వివరాలు నమోదు చేయనున్నారు. ఈ కార్యక్రమం నిర్వహణ కోసం శుక్రవారం ఉదయం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో మున్సిపల్, గ్రామీణాభివృద్ధి అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నారు.


