మంచిర్యాలరూరల్(హాజీపూర్)/జైపూర్/లక్సెట్టిపేట: జిల్లాలో కొనుగోలు చేసిన ధాన్యం దిగుమతి ప్రక్రియ వేగవంతం చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం ఆయన మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని రాజరాజేశ్వరి రైస్‌మిల్లు, జైపూర్ మండలం ఇందారం గ్రామంలో సుముఖ గోదాం, జైపూర్‌లోని జయలక్ష్మి రైస్‌మిల్లు, లక్సెట్టిపేట మండలం వెంకట్రావుపేట గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రం సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అవసరమైతే హమాలీల సంఖ్య పెంచి ధాన్యాన్ని వేగంగా అన్‌లోడ్ చేయాలని రైస్‌మిల్లు యజమానులకు సూచించారు. రోజుకు కనీసం 10నుంచి 15లారీల ధాన్యాన్ని దిగుమతి చేసుకునేలా చర్యలు చేపట్టాలన్నారు. ధాన్యం కొనుగోలు, రవాణా, దిగుమతి ప్రక్రియ సమన్వయంతో కొనసాగాలని, ఎక్కడా జాప్యం జరగకుండా చూసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమాల్లో జిల్లా అదనపు కలెక్టర్ రాములు, కార్మిక శాఖ సహాయ కమిషనర్ క్రాంతి, తహసీల్దార్లు పుష్పలత, దిలీప్‌కుమార్, ఏఓ కృష్ణ, గిర్దావర్ మంగ పాల్గొన్నారు.


