సింగరేణి ఆధ్వర్యంలో వివిధ క్రీడల్లో ప్రత్యేక శిక్షణ 25 రోజులపాటు కొనసాగనున్న శిబిరాలు ఉత్సాహంగా పాల్గొంటున్న చిన్నారులు
రెబ్బెన: ఏడాదిలో 11 నెలల పాటు చదువుతో కుస్తీ పట్టిన విద్యార్థులు వేసవి సెలవుల్లో సమయాన్ని వృథా చేయకుండా ఆటలపై పట్టు సాధించేందుకు కుస్తీ పడుతున్నారు. తమకు నచ్చిన ఆటపై పట్టు సాధించేందుకు క్రీడా శిక్షణ శిబిరాల్లో చేరుతున్నారు. నృత్యం, డ్రాయింగ్, స్విమ్మింగ్, కుంగ్‌ఫూ కరాటే, సంగీతం.. ఇలా ఏదో ఒక శిక్షణ శిబిరంలో చేరి వాటిలో మెలకువలు నేర్చుకుంటున్నారు. విద్యార్థుల ఆసక్తికి అనుగుణంగా శిక్షకులు తర్ఫీదు ఇస్తున్నారు. క్రీడా శిక్షణ శిబిరాలతో ఉదయం, సాయంత్రం వేళల్లో క్రీడామైదానాలు విద్యార్థులతో సందడిగా కనిపిస్తున్నాయి. బెల్లంపల్లి ఏరియా సింగరేణి యాజమాన్యం సైతం ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా వేసవి క్రీడా శిబిరాలను ఏర్పాటు చేయడంతో గోలేటిలోని విద్యార్థులు తమకు నచ్చిన క్రీడలో మెలకువలు నేర్చుకునేదుకు శిబిరంలో చేరి ప్రతీరోజు సాధన చేస్తున్నారు.
మూడు ఈవెంట్లలో శిక్షణ
బెల్లంపల్లి ఏరియా సింగరేణి యాజమాన్యం ప్రతీ సంవత్సరం ఒక్కో ఏరియాకు ఒక్కో అంశంపై శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేస్తుండగా ఈసారి ఏరియాలో ఫుట్‌బాల్, వాలీబాల్, అథ్లెటిక్స్‌లో శిక్షణ ఇస్తున్నారు. ఈ నెల 5న ప్రారంభమైన శిక్షణ 30వ తేదీ వరకు కొనసాగనుంది. 25 రోజుల పాటు కొనసాగే శిక్షణకు హాజరయ్యే విద్యార్థులకు గోలేటి టౌన్‌షిప్‌లోని సింగరేణి ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో శిక్షకులు ఆటలపై మెలకువలు నేర్పిస్తున్నారు. క్యాంపు సామర్ధ్యం 70 మంది కాగా ప్రతీరోజు 60 నుంచి 65 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. ఉదయం, సాయంత్రం గంట పాటు శిక్షణ ఇస్తున్నారు. ఉదయం వ్యాయామం, రన్నింగ్, సాయంత్రం గేమ్ ప్రాక్టీస్ చేయిస్తున్నారు.
గోలేటిలోని సింగరేణి హైస్కూల్ మైదానంలో సాధన చేస్తున్న విద్యార్థులు
సౌకర్యాలతో పాటు స్నాక్స్
గోలేటి క్రీడలకు పెట్టింది పేరు. ఈ ప్రాంతానికి చెందిన ఎంతోమంది క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్నారు. సింగరేణి యాజమాన్యం క్రీడాకారులకు అన్నిరకాల సౌకర్యాలతో కూడిన మైదానాలను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం గోలేటిలోని సింగరేణి హైస్కూ ల్‌లో కొనసాగుతున్న క్రీడా శిక్షణ శిబిరంలో సైతం ఫుట్‌బాల్, వాలీబాల్ కోర్టులతో పాటు అథ్లెటిక్స్‌లో భాగంగా రన్నింగ్, ఇతర ఈవెంట్లలో సాధనకు అవసరమైన వసతులను కల్పించింది. శిబిరాలకు హాజరైన విద్యార్థులకు ప్రతీరోజు సాయంత్రం స్నాక్స్ సైతం అందిస్తూ వారిలో మరింత ఉత్సాహాన్ని నింపుతున్నారు.


