పురుగుల మందు తాగి యువకుడు ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

పురుగుల మందు తాగి యువకుడు ఆత్మహత్య

May 15 2026 12:37 PM | Updated on May 15 2026 12:37 PM

జైనథ్‌: పురుగుల మందు తాగి యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు మండల కేంద్రానికి చెందిన మెరుగు రాకేష్‌ (28) ఆర్థిక ఇబ్బందులతో కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. ఈ నెల 12న రాత్రి 9 గంటల సమయంలో ఇంట్లో పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు 108కు సమాచారం అందించడంతో ఆదిలాబాద్‌లోని రిమ్స్‌కు తరలించారు. చికిత్స అందిస్తుండగా పరిస్థితి విషమించడంతో బుధవారం రాత్రి మృతి చెందాడు. మృతుని అన్న ఉదయ్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.

మద్యానికి బానిసై ఒకరు..

సారంగపూర్‌: మద్యానికి బానిసై ఒకరు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై శ్రీకాంత్‌ తెలిపిన వివరాల మేరకు నిర్మల్‌ మండలంలోని నీలాయిపేట్‌కు చెందిన శనిగారపు లక్ష్మణ్‌ (40) 15 ఏళ్లక్రితం యాకర్‌పెల్లికి వచ్చి ఇక్కడే తన భార్యాపిల్లలతో కలిసి నివాసం ఉంటున్నాడు. తరచూ మద్యం సేవించి ఇంటికి వచ్చేవాడు. బుధవారం సైతం అతిగా మద్యం సేవించి ఇంటికి రావడంతో అతని భార్య దేవకీ మందలించింది. మనస్తాపానికి గురైన లక్ష్మణ్‌ ఇంటినుంచి బయటకి వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు వెతికినా ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. గురువారం గ్రామ శివారులో చెట్టుకు ఉరేసుకుని కనిపించాడు. మృతుని కుమారుడు రాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.

అదృశ్యమైన మహిళ మృతదేహం లభ్యం

ఖానాపూర్‌: ఈ నెల 9న అదృశ్యమైన పట్టణంలోని శాంతినగర్‌కు చెందిన బొమ్మెన మౌనిక (28) మృతదేహం లభ్యమైనట్లు ఎస్సై రాహుల్‌ గైక్వాడ్‌ తెలిపారు. ఖానాపూర్‌కు చెందిన మౌనికకు మామడ మండలంలోని లింగంపల్లికి చెందిన నల్ల అరుణ్‌తో రెండేళ్లక్రితం వివాహమైంది. ఈ నెల 9న అత్తవారి ఇంటి నుంచి బయటకు వెళ్లిన మహిళ తిరిగిరాలేదు. బాధిత కుటుంబ సభ్యులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. గురువారం ఖానాపూర్‌ మండలం తర్లపాడు శివారులోని అటవీ ప్రాంతంలో ఫారెస్ట్‌ వాచర్‌ వెంకట్‌కు మృతదేహం కనిపించడంతో పోలీసులతో పాటు గ్రామస్తులకు సమాచారం అందించాడు. మృతదేహంపై దుస్తులు చిరిగిపోయి ఉండటంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తన సోదరి మృతికి ఆమె భర్త, అత్త, మామ కారణమని మృతురాలి సోదరుడు పవన్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement