పాతమంచిర్యాల: తెలంగాణ మాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్ (టాంకాం) ద్వారా జర్మనీలో నర్సింగ్ ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి రవి కృష్ణ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. బీఎస్సీ నర్సింగ్ లేదా జీఎన్‌ఎం కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులన్నారు, అభ్యర్థుల వయస్సు 22–38 సంవత్సరాల వరకు ఉండాలని జీఎన్‌ఎం అభ్యర్థులు కనీసం మూడేళ్ల అనుభవంతో పాటు ఇండియన్ నర్సు రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ కలిగి ఉండాలన్నారు. మొత్తం ఖాళీలు 90 ఉన్నాయని, అర్హులైన వారు ఈ నెల 18 లోగా ఆన్‌లైన్‌లో germanytripplewin 2025 @gmail.com దరఖాస్తు చేసుకుంటే జూలై 8 నుంచి 17 వరకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎంపికై న అభ్యర్థులకు నెలకు రూ.2.2 లక్షల నుంచి 3 లక్షల వరకు వేతనం ఉంటుందన్నారు. మరిన్ని వివరాలకు 9440049645, 9440052081, 9440051581 నంబర్లలో లేదా www.tomcom. telangana. gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.
బాసర హుండీ ఆదాయం రూ.1.03 కోట్లు
బాసర: బాసర జ్ఞాన సరస్వతి ఆలయ హుండీని గురువారం లెక్కించగా 90 రోజుల ఆదాయం రూ.1,03,75,308 సమకూరినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. భక్తులు సమర్పించిన మిశ్రమ బంగారం 40 గ్రాముల 200 మిల్లీ గ్రాములు, మిశ్రమ వెండి 2 కిలోల 550 గ్రాములు, విదేశీ కరెన్సీ నోట్లు 24 వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో కె.అంజనిదేవి, దేవాదాయ శాఖ నిర్మల్ పరిశీలకులు ఆర్.రవికిషన్, ఆలయ పర్యవేక్షకులు శివరాజ్, సంజీవ్‌రావు, తదితరులు పాల్గొన్నారు.


