మత్తు వదిలేలా.. | - | Sakshi
Sakshi News home page

మత్తు వదిలేలా..

Apr 6 2026 9:24 AM | Updated on Apr 6 2026 9:24 AM

● డ్రంకెన్‌ డ్రైవ్‌ తరహాలో డ్రగ్‌ టెస్టులు ● సేవించేవారికి డీఅడిక్షన్‌ సెంటర్‌లో వైద్యం ● కౌన్సెలింగ్‌తో మార్పు తెచ్చే ప్రయత్నం ● స్కూళ్లు, కాలేజీలు, బహిరంగ ప్రదేశాలపై నజర్‌

మంచిర్యాలక్రైం: మాదక ద్రవ్యాలకు బానిసైన యువత భవిష్యత్‌ను అంధకారం చేసుకుంటున్నారు. డ్రగ్స్‌, గంజాయి నియంత్రణకు తెలంగాణలో యాంటి నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (టీ న్యాబ్‌) సిబ్బంది తమదైన శైలిలో ముందుకెళ్తున్నారు. గంజాయి, నాటుసారా, గుడుంబా, మద్యం అక్రమ తరలింపుపై ప్రత్యేక నిఘా పెట్టారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల పోలీస్‌స్టేషన్లకు డ్రంకెన్‌ డ్రైవ్‌ తరహాలో బ్రీత్‌ ఎనలైజర్‌ మాదిరి డ్రగ్స్‌ ఇన్వెస్టిగేషన్‌ కిట్లను అందజేశారు. ఆపరేషన్‌ పరివర్తన్‌ కార్యక్రమం ద్వారా విద్యాసంస్థలు, గ్రామీణ ప్రాంతాల్లో యువతకు మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే అనర్ధాలపై అవగాహన కల్పిస్తున్నారు. మత్తుకు బానిసైన వారికోసం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో 2024లో డీ అడిక్షన్‌ సెంటర్‌ ఏర్పాటు చేసి ఉచితంగా వైద్యం అందిస్తున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు డీ అడిక్షన్‌ సెంటర్‌లో గతేడాది 1000 మంది మత్తు బానిసత్వం నుంచి విముక్తి పొందారు. సగటున నెలకు 80 నుంచి 90 మంది వరకు చికిత్సకోసం వస్తుండగా వారిలో చాలా వరకు 15 నుండి 40 సంవత్సరాల వయస్సువారే అధికంగా ఉంటున్నారు. పైగా 90 మందిలో 20 శాతం విద్యార్థులే ఉంటున్నారని వైద్యులు పేర్కొంటున్నారు. ఇటీవల చెన్నూర్‌కు చెందిన బాలుడు (17) గంజాయికి బానిసైనట్లు గుర్తించిన సీఐ బన్సీలాల్‌ డీ అడిక్షన్‌ సెంటర్‌కు తరలించిన ఘటన ఆందోళన కలిగించింది. యువతను సన్మార్గంలో పెట్టేందుకు డీసీపీ ఎగ్గడి భాస్కర్‌ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. మత్తుకు బానిసైన యువకుల జీవితాలను పాట రూపంలో రచించిన వీడియో సాంగ్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

నార్కోటిక్‌ డాగ్‌తో తనిఖీలు

యువతే లక్ష్యంగా గంజాయి స్మగ్లర్లు తమ వ్యాపారం విస్తరిస్తున్నారు. గంజాయి రవాణా, విక్రయాలు అడ్డుకునేందుకు పోలీస్‌ శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. ప్రత్యేక శిక్షణ పొందిన నార్కోటిక్‌ డాగ్‌తో తనిఖీలు చేపడుతున్నారు. ఇది సుమారు కిలో మీటర్‌ దూరం నుంచే గంజాయి వాసనను పసిగడుతుంది. జిల్లాలో ఇప్పటి వరకు గంజాయి విక్రయించిన, సేవించిన 300ల మందిపై కేసులు నమోదయ్యాయి. పోలీసుల తనిఖీల్లో గంజాయి సేవించినట్లు నిర్ధారణ అయితే వారిని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన డీ అడిక్షన్‌ సెంటర్‌కు తరలించి ప్రతీరోజు ఉదయం, సాయంత్రం సైక్రియాట్రిస్ట్‌తో కౌన్సిలింగ్‌ నిర్వహిస్తారు. ఇక్కడ మార్పు రాని వారిని హైదరాబాద్‌కు పంపించి చికిత్స అందించేందుకు పోలీస్‌ శాఖ ఏర్పాట్లు చేసింది.

యువతరాన్ని కాపాడేందుకే...

గంజాయి సేవించే వారిలో అధిక శాతం 18 నుంచి 30 ఏళ్ల వయస్సు వారే ఉండడం ఆందోళన కలిగిస్తోంది. యువతరాన్ని కాపాడేందుకే గంజాయి, ఇతర డ్రగ్స్‌పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. గతంలో గంజాయి కేవలం పట్టణాలకే పరిమితం అయ్యేది. ప్రస్తుతం గ్రామాలకు సైతం పాకింది. యువతను మత్తునుంచి కాపాడేందుకు పోలీస్‌ శాఖ ప్రతీ జిల్లాలో నార్కోటిక్‌ టీమ్‌ను ఏర్పాటు చేసి విస్తృతంగా తనిఖీలు నిర్వహిహిస్తున్నారు. స్కూళ్లు, కాలేజీలు, గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ప్రతీ విద్యాసంస్థలో ప్రహరీ క్లబ్‌ ఏర్పాటు చేశారు. క్లబ్‌ సభ్యులు డ్రగ్స్‌ బారిన పడిని వారిని గుర్తించి డీ అడిక్షన్‌ సెంటర్‌కు తరలించేలా చర్యలు తీసుకుంటున్నారు. డ్రగ్స్‌ బారిన పడిన వారిని కాపాడేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హెల్ప్‌లైన్‌ నంబర్లు 1908, 14416 అందుబాటులో ఉంచాయి.

డ్రగ్స్‌కు బానిసైన వారి లక్షణాలు..

డ్రగ్స్‌కు బానిసైన వారి జీవనశైలి విచిత్రంగా ఉంటుంది. ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడారు. ఒంటరిగా ఉండేందుకు ఇష్టపడతారు. తొందరగా చికాకు పడతారు. చెప్పింది తొందరగా మర్చిపోతారు. మత్తులో విచక్షణ కోల్పోయి ఎంతకై నా తెగిస్తారు. మెడ, మోచేతులపై టాటు, నొసలు, చెవి, చేతులపై గాట్లు కలిగి ఉంటారు. వీరి చాతి పూర్తిగా ఎండిపోయి ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement