రాష్ట్రంలో బీఆర్‌ఎస్ పనైపోయింది
కులమతాలను రెచ్చగొట్టే బీజేపీకి తెలంగాణాలో అవకాశమే లేదు
టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్
క్యాతనపల్లిలో జిల్లా కాంగ్రెస్ కార్యవర్గ సమావేశం
హాజరైన మంత్రులు కృష్ణారావు, వివేక్, ఏఐసీసీ కార్యదర్శి సావంత్
రామకృష్ణాపూర్: కార్యకర్తల వల్లే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ అన్నారు. పార్టీ పటిష్టత కోసం కష్టించి పనిచేసే ప్రతీ కార్యకర్తకు భవిష్యత్‌లో సముచిత స్థానం ఉంటుందని తెలిపారు. క్యాతనపల్లిలోని ఎంఆన్‌ఆర్ గార్డెన్స్‌లో శుక్రవారం జరిగిన జిల్లా కాంగ్రెస్ కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నూతన కార్యవర్గ సభ్యులకు నియామకపు పత్రాలు అందించి వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా మహేష్‌కుమార్‌గౌడ్ మాట్లాడుతూ పదేళ్ల బీఆర్‌ఎస్ నిర్బంధ పాలనలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని, వారి త్యాగాలను పార్టీ ఎన్నటికీ మరిచిపోదని స్పష్టం చేశారు. 65 ఏళ్ల కాంగ్రెస్, టీడీపీ హయాంలో రూ.68వేల కోట్లు అప్పులు చేస్తే బీఆర్‌ఎస్ పదేళ్ల హయాంలో రూ.8లక్షల కోట్లు అప్పు చేసిందని విమర్శించారు. దూరదృష్టి లేకుండా అప్పులు చేసి రాష్ట్రాన్ని ఆర్థికంగా బలహీనపర్చారని, గత అప్పులకు వడ్డీలు కడుతూనే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందిస్తోందని అన్నారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్ పార్టీ పనైపోయిందని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కులమతాల పేరుతో ప్రజలను విభజించి రాజకీయాలు చేస్తోందని తీవ్రంగా మండిపడ్డారు. మంచిర్యాల ఎమ్మెల్యే కే.ప్రేమ్‌సాగర్‌రావు గురించి ప్రస్తావిస్తూ కష్టకాలంలో పార్టీ కోసం కష్టపడ్డారని, ఆయన కష్టం వృథాగా ఏమిపోదని అన్నారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో జరిగిన అన్యాయాలను ప్రజలకు తెలియజేయాలని సూచించారు. పార్టీలో కష్టపడ్డ వారికి తగిన గుర్తింపు ఉంటుందని అన్నారు. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ జిల్లా కార్యవర్గ సమావేశానికి పీసీసీ అధ్యక్షుడు రావడం కార్యకర్తల్లో ఉత్సాహం నింపిందని, అన్ని జిల్లాల్లో మహేష్‌కుమార్‌గౌడ్ పర్యటించడం అభినందనీయమని అన్నారు. మంచిర్యాల ఎమ్మెల్యే కే.ప్రేంసాగర్‌రావు మాట్లాడుతూ మొదటి నుంచి పార్టీ జెండా మోసిన వారికి సముచిత స్థానం కల్పించాలని, ఎన్నికలప్పుడు వచ్చిన వారికి పదవులు ఇస్తే పార్టీ నష్టపోతుందని, తన మాటలను పరిగణనలోకి తీసుకోవాలని సూచన చేశారు. కాగా, మంచిర్యాలలో హెలిప్యాడ్ వద్ద నేతలకు స్వాగతం పలికి ఎంఎన్‌ఆర్ గార్డెన్స్ వరకు ర్యాలీ నిర్వమించారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, ఎమ్మెల్సీ దండే విఠల్, డీసీసీ అధ్యక్షుడు రఘునాథ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్, తదితరులు పాల్గొన్నారు.
గ్యాస్ సబ్సిడీ పడడం లేదు..
సమావేశంలో డీసీసీ కార్యదర్శి శారద మాట్లాడుతూ ఆరు గ్యారంటీలు పూర్తిస్థాయిలో అమలు కావడం లేదని, ముఖ్యంగా గ్యాస్ సబ్సిడీ అందరికీ పడడం లేదని వ్యాఖ్యానించారు. తాను గతంలోనే రాష్ట్ర కమిటీలో పనిచేశానని, ప్రస్తుతం మళ్లీ జిల్లా కమిటీకి పరిమితం చేయడంపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో వేదికపై ఉన్న మంత్రులు, నేతలు ఆశ్చర్యానికి గురయ్యారు.


