సజావుగా సాగేనా! | - | Sakshi
Sakshi News home page

సజావుగా సాగేనా!

Apr 4 2026 7:19 AM | Updated on Apr 4 2026 7:19 AM

● నేడు క్యాతనపల్లి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌, వైస్‌చైర్‌పర్సన్‌ ఎన్నిక ● భారీగా పోలీసు బలగాల మోహరింపు

రామకృష్ణాపూర్‌: క్యాతనపల్లి మున్సిపల్‌ కార్యాలయంలో చైర్‌పర్సన్‌, వైస్‌చైర్‌పర్సన్‌ ఎన్నిక మూడోసారైనా సజావుగా సాగుతుందా అనే ఉత్కంఠ నెలకొంది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు శనివారం ఎన్నికల నిర్వహణకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. జిల్లా అదనపు కలెక్టర్‌ చంద్రయ్య స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. అల్లర్లు, గొడవల కారణంగా గతంలో ఎన్నికలు రెండుసార్లు వాయిదా పడడం, ఎన్నికల కోడ్‌ అమలులో లోపాలు చోటు చేసుకున్నాయన్న విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సమావేశ మందిరంలో ఆయా పార్టీల కౌన్సిలర్లు వేర్వేరుగా కూర్చునేందుకు వీలుగా ఇనుప రెయిలింగ్‌ ఏర్పాటు చేశారు. గత ఎన్నిక సందర్భంగా కౌన్సిలర్ల మధ్య గొడవలు చోటు చేసుకున్న నేపథ్యంలో ఈ దఫా అలాంటి వాటికి అవకాశం లేకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఎక్స్‌అఫీషియో సభ్యులకు వేరుగా సీట్లు ఏర్పాటు చేశారు. వాహనాల పార్కింగ్‌ కోసం ప్రత్యేక స్థలం కేటాయించారు.

భారీగా పోలీసు బలగాలు..

ఎన్నికల నేపథ్యంలో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా క్యాతనపల్లి పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసు బలగాలు మోహరించారు. వందలాది సంఖ్యలో పోలీసులు ప్రధాన కూడ ళ్లు, కార్యాలయ పరిసర ప్రాంతా ల్లో బందోబస్తు నిర్వహిస్తున్నారు. శనివారం ఉదయం 4 గంటల నుంచి సాయంత్రం 6గంటల వ రకు ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు సెక్షన్‌ 163 బీఎన్‌ఎస్‌ఎస్‌ అమల్లో ఉంటుందని, నలుగురికి మించి గుంపులుగా చేరడం, ధర్నాలు, రాస్తారోకోలు, ర్యాలీలు, సభలు నిషేధమని పోలీస్‌ ఉన్నతాధికారులు ప్రకటించారు.

పారదర్శకంగా ఎన్నిక జరిగేనా?

చైర్‌పర్సన్‌ ఎన్నికపై ఓ వర్గం మళ్లీ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గత ఎన్నిక సందర్భంగా లోపల ఏం జరిగిందన్న దానిపై ఇప్పటివరకు స్పష్టత లేకుండా పోయిందని, గొడవలు, తోపులాటలు జరిగాయని కౌన్సిలర్లు పరస్పర ఆరోపణలు చేసినా అధికారిక రికార్డులేవి బయటపెట్టలేదని అంటున్నారు. ఎన్నికల నిబంధనల మేరకు కలెక్టర్‌ కార్యాలయం డీపీఆర్‌వో ద్వారా అర్హత కలిగిన మీడియా ప్రతినిధులకు సమావేశ మందిరంలోకి ప్రవేశం కల్పించాల్సి ఉండగా ఈసారి కూడా అలాంటిదేమీ లేకపోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. హైకోర్టు ఆదేశాలు, రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు పరిగణనలోకి తీసుకుని పారదర్శకంగా ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకోవాలని అభిప్రాయపడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement